»Karimnagar Silver Filigree Gifts For Anant Ambani Wedding
Wedding: అనంత్ అంబానీ వెడ్డింగ్‌లో కరీంనగర్ వెండి ఫిలిగ్రీ బహుమతులు
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహ వేడుకల్లో కరీంనగర్ సంప్రదాయ కళ అయిన సిల్వర్ ఫిలిగ్రీ బహుమతుల్ని ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Anant Ambani Wedding : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ చిన్న తనయుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహం జూలై 12న జరగనుంది. ఈ వేడుకలకు వచ్చే వీవీఐపీలందరికీ బహుతులుగా ఇవ్వడానికి కరీంనగర్ వెండి ఫిలిగ్రీని(Karimnagar Silver Filigree) వారు ఎంపిక చేసుకున్నారు. అందుకోసం చాలా రకాల వెండి( Silver) వస్తువులను వారు ఆర్డర్ చేశారు.
ఈ విషయాన్ని కరీంనగర్ హ్యాండీ క్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అర్రోజు అశోక్ తెలియజేశారు. అంబానీ కుటుంబం మొత్తం 400 రకాల వస్తువులను ఆర్డర్ చేసినట్లు తెలిపారు. వారు ఆర్డర్ చేసిన వాటిలో వెండి ఫిలిగ్రీ(Filigree) కళాఖండాలైన ట్రేలు, పర్సులు, నగల పెట్టెలు లాంటివి చాలా రకాలు ఉన్నాయి. ఈ ఫిలిగ్రీ అనేది పురాతనమైన సంప్రదాయ కళ. దీనిపై ఇక్కడ దాదాపుగా 150 కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. స్వచ్ఛమైన వెండిని కరిగించి తీగలుగా చేసి దానితో రకరకాల ఆకారాల్లో కళాఖండాలను తయారు చేస్తారు. ఆ తీగలను అల్లి వాటిని తీర్చి దిద్దుతారు.
అనంత్ అంబానీ కుటుంబం ఈ వస్తువులను ఆర్డర్ ఇవ్వడంపై కరీంనగర్ కళాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల తమ పురాతన కళకు ఎంతో ప్రోత్సాహం లభిస్తుందని అంటున్నారు. ఇక అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల రెండో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిగేందుకు ఇటలీలోని క్రూయిజ్ సిద్ధం అవుతోంది. ఇటలీ నుంచి సిట్జర్లాండ్ వరకు సముద్రంలో భారీ లగ్జరీ క్రూయిజ్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి. మే 29 నుంచి జూన్ 1 వరకు ఈ వేడుకలు జరుగుతాయి.మూడు వందల మంది వీవీఐపీలు, సినీ ప్రముఖులు, దేశ విదేశీ ప్రముఖులు ఇందులో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.