సోనియా గాంధీ త్యాగంతోనే ప్రత్యేక తెలంగాణ వచ్చిందని దివంగత ప్రజాగాయకుడు గద్దర్ (Gaddar) సతీమణి విమల అన్నారు. ఆమె త్యాగనిరతి ఏంటో తనకు తెలుసని స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ సమావేశా(CWC meeting)లలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన సోనియా గాంధీ గద్దర్ కుటుంబాన్ని ఓదార్చారు. ఆరోగ్య కారణాల రీత్యా సోనియా తాను బస చేసిన హోటల్‌కే విమలను పిలిపించుకున్నారు. ఆమెతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా గద్దర్ కుటుంబాన్ని ఓదార్చారు.
ఈ సందర్భంగా సోనియా గాంధీ (Sonia Gandhi) మాట్లాడుతూ.. ప్రజల హక్కుల కోసం గద్దర్ చేసిన పోరాటాలను కొనియాడారు. రాహుల్ స్పందిస్తూ.. గద్దర్ తనకు అత్యంత ప్రియమైన వ్యక్తి అని సోనియా, ప్రియాంకలకు తెలిపారు. ఆయన గద్దర్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం విమల మీడియాతో మాట్లాడు తూ.. త్యాగమంటే ఏంటో సోనియాకు తెలుసు కాబట్టే ఆమెను కలవాలనుకున్నానని చెప్పారు. ఆ త్యాగం కేసీఆర్‌కు తెలియదని, ఆయన నిరాహార దీక్షలతో తెలంగాణ (Telangana) సిద్ధంగా లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుందని విమల స్పష్టం చేశారు.