క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) కొత్త పార్టీ ప్రకటించాడు. నేడు ఆయన చర్లపల్లి జైలు నుంచి విడుదలై ప్రజల ముందుకు వచ్చారు. అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మల్లన్న మాట్లాడుతూ తాను త్వరలోనే పార్టీ పెడుతున్నట్లు ప్రకటించాడు. తన పార్టీ పేరును తెలంగాణ నిర్మాణ పార్టీ (Telangana Nirmana Party) అని తెలిపారు.
తన పార్టీ పేరును ఇప్పటికే రిజిస్టర్ చేయించినట్లు తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) తెలిపారు. రాబోవు ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు. కేసీఆర్ పైన, సర్కారుపైన తీన్మార్ మల్లన్న నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ (CM KCR) పోలీసు సెక్షన్ల పేరుతో తనలాంటి ఎందరినో అరెస్ట్ చేయిస్తున్నాడన్నారు.
తాను వీకర్ సెక్షన్ ను నమ్ముకుని ముందుకెళ్తున్నానని, అర్హత లేనివారు కూడా మంత్రులుగా కొనసాగుతున్న కేబినెట్ ఇదేనని సీఎం కేసీఆర్(CM KCR) ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తీన్మాన్ మల్లన్న(Teenmar Mallanna) గత నెలలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయనకు మల్కాజిగిరి కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటుగా సుదర్శన్ గౌడ్, బండారు రవీందర్, ఉప్పల్ నిఖిల్, సిర్రా సుధాకర్ లకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల పూచీకత్తుతో కోర్టు బెయిల్ మంజూరు చేయగా బయటికొచ్చిన మల్లన్న కొత్త పార్టీ ప్రకటించి ప్రత్యర్థులకు షాక్ ఇచ్చాడు.