Ration Card E-KYC: ఇప్పటివరకు రేషన్ కార్డు ఈ-కేవైసీ చేసుకోని వాళ్లకి ఈ-కేవైసీ గడువు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. విధించిన గడువు ప్రకారం జనవరి 31వ తేదీ లోగా ఈ-కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. రేషన్ షాపుల దగ్గర భారీ లైన్లు ఉండటంతో అప్డేట్ చేసుకోవడానికి కొందరు సమయం వెచ్చించలేకపోయారు.ఈ-కేవైసీ అప్డేట్ చేయడానికి ఆధార్ ధృవీకరణ, వేలిముద్రలు సేకరిస్తున్నారు. రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం లేకపోతే వెంటనే చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ-కేవైసీ పూర్తి కాకపోతే రేషన్ సరుకులు వచ్చే అవకాశంలేదని కొందరు అంటున్నారు. దీంతో కొందరు గందరగోళానికి గురవుతున్నారు. అలాంటి టెన్షన్ లేకుండా ఈ-కేవైసీ అప్డేట్ చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం మరో నెలరోజుల పాటు అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29వ తేదీ వరకు ఈ-కేవైసీ చేసుకొచ్చని తెలంగాణ పౌరసరఫరాల శాఖ పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 75.76 శాతం మాత్రం రేషన్‌కార్డు దారులు మాత్రమే ఈ-కేవైసీ అప్డేట్ చేసుకున్నారు. మిగతావారు కూడా వెంటనే అప్డేట్ చేసుకోవాలని ఫిబ్రవరి నెల చివరి వరకు ఈ-కేవైసీ గడువు పొడిగించారు.