»Pm Modi Will Participate In Election Campaign In Telangana Tomorrow
PM Modi: రేపు హైదరాబాద్కు రానున్న మోడీ.. ఎల్ బి స్టేడియంలో బీజేపీ బీసీ గర్జన సభ
రేపు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. రేపు భారీ సభ నిర్వహించేందుకు బీజేపీ అధిష్టానం సమాయత్తమవుతోంది. రేపు సాయంత్రం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ గర్జన సభ నిర్వహించనుంది.
PM Modi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెలాఖర్లో జరుగనున్నాయి. ప్రచారానికి మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రచారాలను ముమ్మరం చేశాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ గ్యాప్ లేకుండా రోజుకు రెండు మూడు నియోజక వర్గాలకు తగ్గకుండా ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. అలాగే ఇతర పార్టీలు కూడా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే రేపు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. రేపు భారీ సభ నిర్వహించేందుకు బీజేపీ అధిష్టానం సమాయత్తమవుతోంది. రేపు సాయంత్రం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ గర్జన సభ నిర్వహించనుంది. అందులో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియానికి విచ్చేస్తారు.
సభ అనంతరం ప్రధాని మోడీ తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. కాగా, రేపు బీజేపీ నిర్వహించనున్న బీసీ గర్జన సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభకు దాదాపు లక్ష మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ ప్రతినిధుల బృందం.. సభ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తోంది. తాజాగా సూర్యాపేట సభలో బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రసంగిస్తూ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే బీసీ అభ్యర్థిని సీఎం చేస్తానంటూ ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నిండింది. బీసీ ముఖ్యమంత్రి అంశంపై ప్రచార అస్త్రంగా వాడి ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి తెలంగాణలో మెజారిటీ ఓటర్లు బీసీలే.. వారి ఓట్లను రాబట్టుకునేందుకు బీజేపీ వ్యూహం రచిస్తోంది. తెలంగాణలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలను అన్ని పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, వారికి రాజ్యాధికారం ఇవ్వాలనే ఆలోచన బీజేపీ తప్ప మరే పార్టీకి లేదన్న కోణంలో బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. బీసీలకు రాజ్యాధికారం బీజేపీతోనే సాధ్యమని నేతలు ప్రచారం చేస్తున్నారు. బీసీ గర్జన సభలో బీసీ డిక్లరేషన్ ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. బీసీల బీసీ డిక్లరేషన్లో ఎలాంటి అంశాలు, హామీలు ఇస్తారోనని సర్వత్ర ఎదరుచూస్తున్నారు.