»Panchayat Workers Demands Should Be Resolved Immediately Gandra Satyanarayana Rao
Gandra Satyanarayana Rao: పంచాయతీ కార్మికుల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి
గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను తెలంగాణ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు(Gandra Satyanarayana Rao) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో చిట్యాల ఎంపీడీవో కార్యాలయం ముందు సమ్మె చేస్తున్న జీపీ సిబ్బందికి ఆయన మద్దతు తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికుల డిమాండ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీపీసీసీ సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు(Gandra Satyanarayana Rao) నిలదీశారు. గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యల పరిష్కారం కొరకు చేస్తున్న సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో రోజుకు చేరుకుంది. అయినా కూడా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుందని సత్యనారాయణ రావు మండి పడ్డారు. ఈ సందర్భంగా చిట్యాల(chityal) మండల కేంద్రంలోని ఎంపీడీవో(MPDO) కార్యాలయం ముందు జీపీ కార్మికులు చేస్తున్న సమ్మెకు గండ్ర సత్యనారాయణ రావు గారు మద్దతు తెలిపారు.
గ్రామపంచాయతీ(Panchayati) కార్మికులు గ్రామాలను శుభ్రం చేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడుతుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం వారి సమస్యలను పరిష్కరించకుండా వివక్ష ఉందని గండ్ర సత్యనారాయణ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల మంది పంచాయతీ సిబ్బంది ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 51ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా కారోబార్, బిల్ కలెక్టర్ లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని కోరారు. దీంతోపాటు గ్రామపంచాయతీలలోని ప్రతి ఉద్యోగి, కార్మికుడికి కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) స్పందించి, జీపీ సిబ్బంది నాయకులతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జీఎస్సార్ వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, జిల్లా నాయకులు, సీఆర్పల్లి గ్రామ సర్పంచ్ మోకిరాల మదువంశీ కృష్ణ, చిట్యాల మాజీ జడ్పీటిసి ఓరం సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.