»Congress Leader Gandra Satyanarayana Rao House Arrest At Hanamkonda
Gandra Satyanarayana Rao: గండ్ర సత్యనారాయణ రావు హౌస్ అరెస్ట్..కారణం ఇదే!
కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ రావును పోలీసులు హన్మకొండలో హౌస్ అరెస్ట్ చేశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి భూకబ్జాలు అవినీతి, అక్రమాలను నిరూపించడానికి ఆధారాలతో సహా రెడీ అయిన నేపథ్యంలో పోలీసులు సత్యనారాయణ ఇంటిని చుట్టుముట్టారు.
కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ రావును పోలీసులు హన్మకొండలో హౌస్ అరెస్ట్ చేశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి భూకబ్జాలు అవినీతి, అక్రమాలను నిరూపించడానికి ఆధారాలతో సహా రెడీ అయిన నేపథ్యంలో పోలీసులు సత్యనారాయణ ఇంటిని చుట్టుముట్టారు. నక్కలగుట్టలో తన నివాసం నుంచి భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ కు బయలుదేరడానికి సత్యనారాయణ సిద్దమయ్యారు. ఆ క్రమంలో గండ్ర సత్యనారాయణ రావును బయటకు రాకుండా అడ్డుకుని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
అయితే భూపాలపల్లి ప్రస్తుత అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి, కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ రావు మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. కాంగ్రెస్ నేతలు అధికార పార్టీ ఎమ్మెల్యే రమణారెడ్డి భూ ఆక్రమణలు, కబ్జాల గురించి ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో స్పందించిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఆధారాలతో సహా రుజువు చేయాలని ప్రతి సవాల్ చేశారు. దీంతో ఆధారాలతోపాటు నిరూపించేందుకు తాను సిద్ధమని కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ రావు స్పష్టం చేశారు. ఆ క్రమంలో ఈరోజు ఉదయం 11 గంటలకు భూపాలపల్లి అంబేద్కర్ చౌరస్తా దగ్గరకు వచ్చి ఆధారాలు చూపిస్తానని వెల్లడించారు. ఈ క్రమంలోనే సత్యనారాయణ రావు ఇంటిని పోలీసులు ముట్టడించి బయటకు రాకుండా చేశారు. తాను రుజువు చేయకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సత్యనారాయణ రావు వెల్లడించారు. దీంతో భూపాలపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇప్పటికే మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భూపాలపల్లిలో నిర్వహించిన సభలో రేవంత్ పైకి బీఆర్ఎస్ నేతలే గుడ్లు విసిరారని కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ కార్యకర్తలతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో భూపాలపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నదృష్ట్యా నేటి నుంచి వారం రోజులపాటు భూపాలపల్లిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి వెల్లడించారు.