Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరిని ఈ కేసులో చేర్చారు.
Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మార్చి 10న ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. వారిలో ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావును అరెస్టు చేశారు. ఇందులో ఇంకో ఇద్దరి పేరును చేర్చి మొత్తం ఆరుగిరిని ఛార్జిషీట్లో నిందితులుగా పేర్కొన్నారు.
ఈ కేసులో బెయిల్ కోసం అడిషినల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారిని కేవలం రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని, అందుకే ఇప్పటి వరకు ఈ కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషన్లో నిందుతుల న్యాయవాది పేర్కొన్నారు. దీనికి కౌంటర్ పిటిషన్ వేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ).. ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసినా ఇంకా విచారణ అయిపోలేదని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును బుధవారం వెల్లడించనున్నట్లు నాంపెల్లి కోర్టు తెలిపింది.