new cabinet: కేంద్రంలో చంద్రబాబు, నితీష్ల అద్దిరిపోయే డిమాండ్లు ఇవే
కేంద్రంలో ఈ సారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో బీజేపీకి మిత్ర పక్షాల అవసరం ఏర్పడింది. దీంతో ఎక్కువ మంది ఎంపీలు కలిగిన చంద్రబాబు, నితీష్ కుమార్‌లు ఇప్పుడు తమ డిమాండ్ల సాధనకు ప్రయత్నిస్తున్నారు.
Modi’s new cabinet: గత రెండు ఎన్నికల్లోనూ( 2014, 2019) బీజేపీ సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లను సంపాదించుకుంది. దీంతో మిత్ర పక్షాల డిమాండ్ల విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. అయితే 2024లో జరిగిన ప్రస్తుత ఎన్నికల్లో ఈ సీన్ కాస్త మారింది. ఇప్పుడు బీజేపీ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినన్ని సీట్లను సాధించుకోలేకపోయింది. దీంతో మిత్ర పక్షాల్లో ఎక్కువ మంది ఎంపీలు కలిగిన పార్టీల డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ఇప్పుడు మోదీ పక్షంపై పడింది.
ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీకి ఇప్పుడు అధిక సంఖ్యలో ఎంపీలు ఉన్నారు. దీంతో దీన్ని ఆసరాగా చేసుకుని చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయాన్ని తెరమీదకు తెచ్చి డిమాండ్ చేయనున్నారని తెలుస్తోంది. 2016లో ఈ విషయంలో వచ్చిన భిన్నాభిప్రాయాల వల్లనే చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu) బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. సంకీర్ణాల సమయంలో వ్యవహరించాల్సిన తీరుపై బాబుకు బాగా అనుభవం ఉంది. కాబట్టి కీలకమైన మంత్రి పదవులు, స్పీకర్ పదవిని బాబు డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వెలువడుతున్నాయి.
ఇక బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Nitish Kumar) సైతం తమ డిమాండ్ల విషయంలో ఇప్పటికే బేర సారాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కనీసం ఐదు మంత్రి పదువులు, బీహార్‌కు ప్రత్యేక హోదా, కేంద్ర నిధులు లాంటి విషయాల్లో వారి డిమాండ్ల ఉన్నాయని తెలుస్తోంది. కేంద్రం ఇప్పటికే జేడీయూకి మూడు క్యాబినేట్ బెర్తులు, ఒక సహాయ మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందట. అయితే ఈ విషయంలో ఇంకా మంతనాలు జరుగుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.