PDPL: సిఎస్ఆర్ (CSR) నిధులతో గ్రామీణ, విద్యా భివృద్ధి పనులు చేపట్టేందుకు హిందుస్థాన్ కోకా కోలా కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్ శ్రీహర్ష ఎంఓయు (MOU) కుదుర్చుకున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా నీటి భద్రత, విద్య, మహిళా సాధికారత వంటి కార్యక్రమాలను ప్రాధాన్యతగా అమలు చేయనున్నారు. సమీకృత కలెక్టరేట్లో జరిగిన ఈ సమావేశంలో అభివృద్ధి పై ప్రత్యక దృష్టి సారించాలన్నారు.
SRD: కుమ్మెర జాతరలో రజక, దళిత కుటుంబాలపై అగ్రవర్ణాల దాడిని నిరసిస్తూ సోమవారం ఖేడ్ రాజీవ్ చౌక్ వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు. పసికందు మృతికి కారణమైన వారిపై హత్యాకేసు నమోదు చేసి, వెంటనే అరెస్ట్ చేయాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొఠారి నర్సింలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కార్యదర్శి రమేష్, సీపీఐ నాయకులు చిరంజీవి పాల్గొన్నారు.
SRPT: రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని తుంగతుర్తి సీఐ నరసింహారావు పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా వాహనదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం మత్తులో వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరమని, ఇది చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.
KMR: ఉప్పల్వాయి-కామారెడ్డి మధ్య ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ ఈ నెల 25న బుధవారం రోజు రాత్రి 11 గంటల వరకు మూసి వేస్తున్నట్లు రైల్వే అధికారులు నేడు ఒక ప్రకటనలో తెలిపారు. మరమ్మతుల కారణంగా మూసివేస్తున్నట్లు చెప్పారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని సూచించారు.
KMR: జిల్లా దివ్యాంగ విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. HYD లో ఈనెల 17న నిర్వహించిన పోటీల్లో జిల్లా నుంచి 30 మంది పాల్గొన్నారు.12 మంది ట్రోఫీలు, బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు సాధించారు. అథ్లెటిక్స్, షాట్పుట్, లాంగ్ జంప్, రన్నింగ్ ఈవెంట్స్‌లో తమ సామర్థ్యాన్ని చాటారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సత్కరించి అభినందించారు.
RR: చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి రూ. 100 కోట్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. నిన్న చేవెళ్ల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్, పాలకవర్గ సన్మానసభలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య విజ్ఞప్తి మేరకు ఈ నిధులు కేటాయిస్తున్నామన్నారు. వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
HNK: పట్టణ కేంద్రంలో ఇవాళ సిద్దిపేట MLA, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటించినట్లు BRS జిల్లా అధ్యక్షుడు, మాజీ MLA దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. ఉదయం 10 గంటలకు కాజీపేట చౌరస్తాకు చేరుకుంటారని BRS శ్రేణులు అధిక సంఖ్యలో వచ్చి ఘన స్వాగతం పలకాలన్నారు. అనంతరం 11 గంటలకు WGLలో నిర్వహిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల పురోగతిని పరిశీలించనున్నారు.
JN: చిల్పూర్ మండలంలోని శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన తొళక్కము ప్రారంభ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, సతీమణి మాధురి షాతో కలిసి పాల్గొన్నారు. ఆలయ ఈవో లక్ష్మీ ప్రసన్న, ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
GDWL: మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. జిల్లాలోని 40 కేంద్రాల్లో 8,110 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ప్రతి కేంద్రంలో మౌలిక వసతులతో పాటు, అత్యవసర వైద్యం కోసం ప్రాథమిక చికిత్స మందులను అందుబాటులో ఉంచాలని అధికారులను సూచించారు.
SDPT: జిల్లాలోని 42 ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ప్రజలు గుమిగూడకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
HYD: హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల కాలుష్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. నగరానికి తాగునీటి వనరులైన హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల కాలుష్యంపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. మురుగు, పరిశ్రమల వ్యర్థాలు చేరుతున్నాయన్న ఆరోపణలపై జలమండలి సహా సంబంధిత శాఖలను ప్రతివాదులుగా చేర్చి, నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
WNP: పాల్గల్ మండలం మహమ్మదాపూర్ గ్రామంలో రేపు మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోవర్ధన్ సాగర్ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులను ఆయన కోరారు.
NZB: అకాల వర్షాల కారణంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు పసుపు రైతులకు పలు సూచనలు చేశారు. నేడు పసుపు వ్యాపార లావాదేవీలు మూసివేయనున్నట్లు తెలిపారు. యార్డులో సరైన స్థలం లేకపోవడంతో మంగళవారం పసుపు రైతులు ఎవరూ తీసుకురావద్దని సూచించారు. బుధవారం నుంచి కనుగొళ్లు యథావిధిగా ఉంటాయన్నారు.
SRCL: వేములవాడ పట్టణంలోని శాస్త్రి నగర్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన 120.4 లీటర్ల వివిధ బ్రాండ్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ తెలిపారు. కోల మారుతి అనే వ్యక్తి ఇంట్లో నిల్వ ఉంచిన సుమారు రూ.55 వేల విలువైన మద్యం సీజ్ చేసి, నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన వివరించారు.
NRPT: పనిచేసే చోట మహిళలపై జరిగే లైంగిక వేధింపులు పూర్తిగా అరికట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన పోష్ చట్టం అవగాహన వాల్ పోస్టర్ను సోమవారం కలెక్టరేట్లో విడుదల చేశారు. లైంగిక నిరోధక చట్టం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా, వ్యాపార సంస్థలు, పరిశ్రమలలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు.