NZB: డివిజన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 24 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిని ఇవాళ జిల్లా మార్నింగ్ కోర్టులో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వారిలో 21మందికి రూ.2.10లక్షల జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చింది. మరో ముగ్గురికి ఒక్కొక్కరికి వారంపాటు జైలు శిక్ష పడింది. అంతకుముందు వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు.
BHNG: బీబీనగర్ గూడూరు బాలికల గురుకుల పాఠశాలలో కనీస వసతులు లేక విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించారు. నీళ్లచారు, పురుగుల అన్నం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. వీరికి మద్దతుగా BRS నాయకులు ధర్నాలో పాల్గొని, విద్యార్థుల ఆరోగ్యంతో ఆడుకోవద్దని డిమాండ్ చేశారు. మెరుగైన భోజనం, వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
GDWL: అన్యాయంగా పసిపాపను చంపిన హంతకులకు పోలీసులు కొమ్ముకాస్తున్నారు అని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి పేర్కొన్నారు. మంగళవారం గద్వాల పాత బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. కుమ్మేర జాతరలో చిన్నారి మృతికి కారకులైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. విచారణను తప్పుదోవ పట్టిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
NLG: దేవరకొండ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ పరీక్ష తరగతి గదులలో విద్యార్థుల సమస్యలపై మంగళవారం ఆర్డీవో ఆఫీస్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ యలమల గోపీచంద్ మాట్లాడుతూ.. రేపటి నుంచి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పరీక్ష రాసే గదులలో విద్యుత్ లైట్లు, ఫ్యాన్స్ , మంచినీటి వసతి, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.
మంచిర్యాల రైల్వే అండర్ బ్రిడ్జి రహదారిపై ప్రమాదకరంగా మారిన గుంతలను పూడ్చాలని 55వ డివిజన్ కార్పొరేటర్ గాండ్ల సత్తమ్మ కోరారు. మంగళవారం కార్పొరేషన్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రోడ్డుపై ఉన్న గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు రోడ్డు మరమ్మతులు త్వరగా చేపట్టాలని ఆమె కోరారు.
HNK: రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీపీఎం పార్టీ కాజీపేట మండల కమిటీ ఆధ్వర్యంలో కాజీపేట తహసీల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. సీపీఎం మండల కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య మాట్లాడుతూ.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు, అయోధ్యపురం భూ-నిర్వాసితులకు, అప్రెంటిస్ చేసిన యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు.
BDK: మార్చి 1న లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డలో వేడుకలు నిర్వహిస్తున్నట్లు జేఏసీ ఛైర్మన్ లక్ష్మణ నాయక్ తెలిపారు. కొత్తగూడెం సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజును గిరిజన లంబాడీ సంఘాల జేఏసీ నాయకులు కోరారు. మంగళవారం ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు.
RR: మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ల బఫర్ జోన్ వివాదంపై MLA ప్రకాష్ గౌడ్ స్పందిస్తూ, బిల్డర్ల తప్పిదాలకు కొనుగోలుదారులు బలికాకుండా ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తుందని హామీ ఇచ్చారు. బఫర్ జోన్ పరిధిలోని ఫ్లాట్ యజమానులకు వేరే గెటెడ్ కమ్యూనిటీలో సమాన విస్తీర్ణమున్న ఫ్లాట్లను ఇవ్వడం లేదా ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చేయిస్తాం అన్నారు.
ఆసిఫాబాద్ కలెక్టరేట్ భవనంలోని ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ హరిత అకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి సమయపాలనపై అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు విధులకు సమయానికి హాజరవుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ADB: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు జైలులో ఉండటం కొత్తేమీ కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్ జైలులో ఉన్న బాల్క సుమన్‌తో ములాఖత్ అయ్యాక కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో సుమన్ ఎన్నో సార్లు జైలుకు వెళ్లి వచ్చారన్నారు. జైలులో పెడితే సుమన్ భయపడతారని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే పొరపాటేనన్నారు.
MLG: జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు 30 ఏళ్ల అజ్ఞాత జీవితం అనంతరం లొంగిపోయారు. ఆయనతో పాటు కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, నేతలు మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి తదితరులు నేడు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు.
SRCL: ఇంటర్మీడియట్ పరీక్షలకు చందుర్తి మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు చీప్ సూపర్డెంట్ మోహన్ కుమార్ తెలిపారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు మొత్తం 100 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు128 మంది మొత్తం 228 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు.
MDK: నర్సాపూర్ మండలం కాగజ్మద్దూర్ శివారులో భారీగా విదేశీ మద్యం పట్టుబడటం కలకలం రేపింది. స్థానిక బయో మెడికల్ వ్యర్థాల పరిశ్రమలో నిల్వ ఉంచిన ఈ మద్యాన్ని ఆబ్కారీ అధికారులు మెరుపు దాడి చేసి గుర్తించారు. ఇతర దేశాలకు చెందిన ఈ బ్రాండ్లు ఇక్కడికి ఎలా వచ్చాయి.? దీని వెనుక ఉన్న ముఠా ఎవరు..? అనే కోణంలో ఎక్సైజ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ వెంటనే చేయడం వలన మనిషిని బతికించే అవకాశాలు పెరుగుతాయని వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాయినాథ్ రెడ్డి తెలిపారు. జిల్లాలో రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్యక్రమం మొబైల్ హెల్త్ టీమ్స్ కోసం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మొబైల్ హెల్త్ టీమ్ సభ్యులకు సమగ్ర అవగాహన కల్పించామన్నారు.
KNR: కులవృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కుతుండగా అదుపుతప్పి కింద పడటంతో ఓ గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. రామడుగు మండలంలోని చిప్పకుర్తి గ్రామానికి చెందిన బుర్ర లచ్చయ్య గౌడ్ మంగళవారం ఉదయం కల్లు గీసేందుకు చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే ఆయనకు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.