హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు వినూత్నంగా ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పిస్తూనే ఉంటారు. తాజాగా… టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ ని కూడా వాడేసుకున్నారు. ఇటీవల రోహిత్ శర్మ ఆస్ట్రేలియా తో జరిగిన టీ20 సిరీస్ లో దినేష్ కార్తీక్ తో ప్రవర్తించిన తీరును తమకు అనుగుణంగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం.
ఇంతకీ మ్యాటరేంటంటే…ఒక సందర్భంలో హెల్మెట్ లేని దినేశ్ కార్తీక్ మెడను గడ్డాన్ని పట్టుకుని చిరుకోపం ప్రదర్శిస్తున్నట్లు రోహిత్ శర్మ కనిపించాడు. మరో సందర్భంలో హెల్మెట్ ధరించిన దినేశ్ కార్తీక్‌పై రోహిత్ ముద్దులు కురిపించాడు.
ఈ రెండు ఎక్స్ ప్రెషన్స్ తో కూడిన ఫోటోలను హైదరాబాద్ పోలీసులు వినియోగించుకున్నారు. మొదటి ఫోటోలో దినేశ్ కార్తీక్ హెల్మెట్ ధరించలేదు. రెండో ఫోటోలో దినేశ్ కార్తీక్ హెల్మెట్ ధరించాడు. హెల్మెట్ ధరిస్తే అంతా సవ్యంగా ఉంటుందని, ప్రాణాలు నిలుస్తాయని, ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలంటూ పోలీసులు సూచించారు.