బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఆయన కేసుకు సంబంధించి విచారణ రేపు జరగనుంది. దీంతో… విచారణ ఎలా జరగనుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత నెల 25 నుంచి రాజాసింగ్ జైల్లోనే ఉన్నారు. పిడి యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు. రాజాసింగ్ కేసును రేపు PD అడ్వైజరీ కమిటీ విచారించనుంది.
ఇప్పటికే రాజాసింగ్‌ను జైలు నుంచి విడిపించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. రాజాసింగ్ భార్య ఉషాబాయి స్వయంగా రంగంలో దిగి గవర్నర్‌ను కలిశారు. తన భర్తకు ప్రాణహాని ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అదే విధంగా హైకోర్టును కూడా ఆశ్రయించారు. భర్తను జైలు నుంచి విడిపించుకోడానికి ప్రయత్నించారు.
ప్రముఖ స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ షో హైదరాబాద్‌లో జరిగింది. ఆ షో జరగకూడదని రాజాసింగ్ తీవ్రంగా ప్రయత్నించారు. గతంలో హిందూ దేవతలను తన కామెడీ షోలలో అవమానపరిచే వ్యాఖ్యలు చేశాడని…అటువంటి వ్యక్తిని హైదరాబాద్‌లో అడుగు పెట్టనివ్వవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని రాజాసింగ్ కోరారు. రాజాసింగ్ మాటలను లైట్‌గా తీసుకున్న కేసీఆర్ సర్కార్ మునావర్ షోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పటిష్ట పోలీసు భద్రత నడుమ షో నిర్వహించింది.
మునావర్ జో జరగడాన్ని నిరసిస్తూ యూ ట్యూబ్‌లో ఓ వీడియో అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయంటూ నిరసన వెల్లువెత్తడంతో ఆ వీడియోను వెంటనే తొలిగించారు. రాజాసింగ్‌ను అరెస్టు చేశారు. పాత కేసులను కూడా తిరగదోడారు. రాజాసింగ్‌పై పీడి యాక్టు నమోదు చేసి అరెస్టు చేశారు.