తెలుగు సినిమా ఖ్యాతిని మరో మెట్టుకు పైకి ఎక్కించిన మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పోటీ పడి నటించారు. వీరిద్దరి నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలుస్తుందని అందరూ భావించారు. కానీ…ఆర్ఆర్ఆర్ కి రాలేదు.
కానీ గుజరాత్ కు చెందిన ‘ ఛెలో షో ‘ 2023 ఆస్కార్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన సెలక్షన్ కమిటీ ఈ సినిమాను ఎంపిక చేసింది. దీంతో ఇటు రాంచరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా చాలా డిసపాయింట్ అయ్యారు. అయితే దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
ఆస్కార్ బరి నుంచి ఆర్ఆర్ఆర్ ఔట్ కావటం, గుజరాత్ కు చెందిన ఛెలో షోను ఎంపిక చేయటంపై ఉస్మానియా వర్శిటీ ప్రొఫెసర్, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ ఓ ట్వీట్ చేశారు. ‘ఆస్కార్ రేస్ లో గుజరాత్ ఛెలో షో తో పోటీ పడి మన ఆర్ఆర్ఆర్ ఓడిపోయింది. మన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కూడా రాలే. కానీ గుజరాత్ కు లోకోమోటివ్ ఫ్యాక్టరీ వచ్చింది. మా హైదరాబాద్ కు వచ్చిన WHO సెంటర్ గుజరాత్ కు తరలిపోయింది. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఆర్బిట్రేషన్ సెంటర్ కు పోటీగా గుజరాత్ సిటీలో ఏర్పాటు చేసిన GIFT పోటీదారుడిగా మారింది’ అంటూ రాసుకొచ్చారు.
ఈ ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ఈ విషయాలపై తెలంగాణకు చెందిన ఒక్క బీజేపీ జోకర్ కూడా ప్రశ్నించలేరు. డిమాండ్ చేసే దమ్ము కూడా లేదు. గుజరాతీ బాస్‌ల చెప్పులు మోయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. కానీ తెలంగాణ హక్కులను డిమాండ్ చేసే ధైర్యం వారు చేయలేరు. మోడీవర్స్‌కు గుజరాత్ కేంద్రం’ అంటూ రాసుకొచ్చారు. పరోక్షంగా బండి సంజయ్ చెప్పులు పట్టుకున్న అంశాన్ని తన ట్వీట్ లో ప్రస్తావించారు.