తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. సొంతంగా ఓ జెట్ విమానం కొనుగోలు చేయనున్నారు. దీని కోసం ఆయన ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దసరా రోజున ఈ విషయంలో ఆయన కీలక ప్రకటన చేయాలని నిర్ణయం తీసుకున్నారు కూడా. కాగా.. ఇప్పటికే పార్టీ పేరును సిద్ధం చేసుకున్నారు, విజయదశమి రోజున సీఈసీకి సమర్పించే పత్రాలపై సంతకాలు చేయనున్నారు. ఇక పార్టీని ఏర్పాటు చేసిన తరువాత కరీంనగర్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో కరీంనగర్‌లోనే మొదటి సభను ఏర్పాటు చేశారు. అదే సెంటిమెంట్‌ను జాతీయ పార్టీ విధానంలో కూడా అమలు చేయనున్నారు.
ఇక సొంత పార్టీ ఏర్పాటు చేసిన తరువాత దేశవ్యాప్త పర్యటనల కోసం కేసీఆర్ రూ. 100 కోట్ల రూపాయలతో సొంత విమానం కొనుగోలు చేయనున్నారు. ఆరు సీట్లు కలిగిన ఈ జెట్ ద్వారా అనేక రాష్ట్రాల్లో తన పర్యటనలకు సిద్దం అవ్వాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం పార్టీలోని పది మంది నేతలు విరాళాలు ఇచ్చారు. ఇందులో ముగ్గురు ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు ఉండగా, ఒకరు నల్లగొండ, మరోకరు కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలు ఉన్నారు. కరీంనగర్లో సభను నిర్వహించిన తరువాత కేసీఆర్ ఢిల్లీలోనూ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. తనతో కలిసివచ్చే పార్టీలతో ఢిల్లీలో సభను ఏర్పాటు చేస్తారని సమాచారం.