టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు ఇటీవల ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయగా… ఈ రోజు ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. క్యాసినో వ్యవహారంలో చీకోటీ ప్రవీణ్ ను ఈడీ విచారించిన సమయంలో ఎమ్మెల్యే కిషన్ రెడ్డితో సంబంధాల పైన ఆరా తీసారు.
ప్రవీణ్ ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చింది. నోటీసుల్లో పేర్కొన్న మేరకు ఈ రోజు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఆయన పైన ప్రధానంగా ఫెమా ఉల్లంఘనల ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. హవాలా , మనీ లాండరింగ్ ద్వారా డబ్బులు బదలాయించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీని మీద ఈడీ వివరణ కోరుతున్నట్లుగా తెలుస్తోంది.
కేసినో వ్యవహారంలో చీకోటి ప్రవీణ్ ఇచ్చిన సమచారం మేరకు పలువురు రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్లుగా అప్పట్లోనే ప్రచారం సాగింది. కిషన్ రెడ్డి ఇతర దేశాల్లో కేసినోలో పాల్గొన్నారనే సమాచారం ఈడీ వద్ద ఉంది. ఫెమా నిబంధనల ఉల్లంఘన ఆరోపణల పైన ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఇచ్చిన స్టేట్ మెంట్ ను ఈడీ రికార్డు చేసింది. తాను ఎక్కడా ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించ లేదని ఎమ్మెల్యే చెబుతున్నారు. ఇదే కేసులో మరి కొంత మంది రాజకీయ నేతల పేర్లు ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో.. కిషన్ రెడ్డి తర్వత ఎవరికి నోటీసులు అందిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.