NRML: పదవ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. లక్ష్మణచందా మండలం వడ్యాల్ జడ్పీ హైస్కూల్‌ను ఇవాళ ఆమె ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. గణితం, ఇంగ్లీషు వంటి విషయాలపై ప్రశ్నలు అడిగి వారి ప్రతిభను పరిశీలించారు. పరీక్షల్లో ఒత్తిడికి లోనుకాకుండా ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచించారు.
SRD: సిర్గాపూర్ రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయం సాగుపై శుక్రవారం MAO హరికృష్ణ రైతులకు అవగాహన కల్పించారు. హెర్బీ సైడ్ టాలరెంట్ HT భక్తి సాగు వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు భూసార పరీక్ష కార్డు సిఫారసు ఆధారంగా రసాయన ఎరువుల వాడకంపై సూచనలు ఇచ్చారు. బియ్యం కిసాన్ లబ్ధిదారులు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో AEO భాస్కర్, రైతులు ఉన్నారు.
BDK: మణుగూరు మండలం విప్పల సింగారం గ్రామానికి చెందిన చుక్కమ్మ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వారి నివాసానికి వెళ్లి చుక్కమ్మ భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు.
NZB: న్యాయవ్యవస్థపై తాము పెట్టుకున్న నమ్మకం నిలబడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. శుక్రవారం కోర్టు తీర్పు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను ముందు నుంచి చెప్తున్న విధంగానే రాజకీయ కుట్రలో భాగంగా పెట్టిన కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు రావడం జరిగిందన్నారు. ఈ కేసు పెట్టిన నుంచి తనకు అండగా నిలిచిన వారందరిని తాను ఎప్పటికీ మర్చిపోనన్నారు.
NLG: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా చిట్యాల పీఎంశ్రీ జి.ప.ఉ. పాఠశాలలో రూపొందించిన ప్రత్యేక పోస్టర్‌ను హెచ్ఎం బోడ సుశీల శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలలో శనివారం నిర్వహించే సైన్స్ దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తమ మేధాశక్తిని ఉపయోగించి ఆవిష్కరణలను ప్రదర్శించాలని చెప్పారు.
MNCL: కళలపై చిన్నారులకు ఆసక్తిని పెంచాలని జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ సంగీత సూచించారు. శుక్రవారం తిమ్మాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం-2లో నిర్వహించిన ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. చిన్నారులకు చదువుతో పాటు కళలపై ఆసక్తి పెంచితే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగేష్, హెచ్ఎం రాజు ఉన్నారు.
MDCL: కీసర MEOగా పాటి వెంకటరామ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా సేవలందిస్తున్న ఆయనను డీఎస్ఈ (DSE), హైదరాబాద్ ఆర్జేడీ(RJD) ఉత్తర్వుల మేరకు ఈ పదవిలో నియమించారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జీహెచ్ఎంలు రవీందర్, రాములు, రామ్ రెడ్డి, మైత్రేయి, పుష్పకళ శుభాకాంక్షలు తెలిపారు.
NZB: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఎల్ఎల్‌బీ ఐదో సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా కొనసాగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 28 మంది విద్యార్థులకు 27 మంది హాజరుకాగా, ఒక్కరు గైర్హాజరైనట్లు వెల్లడించారు. విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడలేదని తెలిపారు.
NRPT: మాగనూర్ మండలం వాడ్వాట్లో రూపుదిద్దుకోనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్జెస్టేషన్ నిర్మాణానికి మంత్రి వాకిటి శ్రీహరి శుక్రవారం భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సబ్జెస్టేషన్ అందుబాటులోకి వస్తే వోల్టేజ్ సమస్యలు తొలగి, రైతులకు, ప్రజలకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందుతుందన్నారు. గ్రామీణాభివృద్ధిలో విద్యుత్ కీలకమని పేర్కొన్నారు.
NZB: తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం ఎంపీ KR.సురేశ్ రెడ్డి రాజ్య సభలో మాట్లాడారు. తెలంగాణకు సంబంధించిన పలు సమస్యలపై ఆయన ప్రస్తావించారు. 2025-26లో రైతు సమస్యలు, యూరియా కొరత, పంట బీమా లోపాలు, కృష్ణా-గోదావరి జలాలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, మైనారిటీ హక్కులు, వక్స్ బిల్లు గురించి మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు న్యాయం చేయాలని ఆయన కోరారు.
NLG: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో విద్యార్థులు, అధ్యాపకులపై జరిగిన అమానుష దాడిని ఎస్‌ఎఫ్‌ఐ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. శుక్రవారం దేవరకొండలో డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ADB: సాయుధ సిబ్బందికి విధులలో క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరిగా ఉండాలని జిల్లా SP అఖిల్ మహాజన్ తెలిపారు. పట్టణంలోని పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో సాయుధ సిబ్బందికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విశ్రాంతి గదిని వాహనాల రక్షణ నిమిత్తం ఏర్పాటు చేసిన షెడ్డును SP శుక్రవారం ప్రారంభించారు. AR DSP ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకటి, మురళి తదితరులున్నారు.
KMR: జుక్కల్ మండలంలోని అన్ని గ్రామాల MRPS కార్యకర్తలు ‘హలో మాదిగ-చలో పిట్లం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని MRPS మండల అధ్యక్షుడు మారుతి పిలుపునిచ్చారు. రేపు రాష్ట్ర SC, ST కమిషన్ ఛైర్మన్ భక్కి వెంకటయ్య పిట్లం రానున్నట్లు చెప్పారు. ఎమ్మార్పీఎస్ తరఫున తమ సమస్యలు తెలిపేందుకు అందరూ తరలి వెళ్లాలన్నారు. పిట్లం మార్కెట్ యార్డ్‌లో ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆయన కోరారు.
MBNR: మిడ్జిల్ మండలంలోని 24 గ్రామపంచాయతీలకు చెందిన నూతన సర్పంచులకు గత 5 రోజులుగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా ప్రాంగణంలో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ శిబిరం ఈరోజు ముగిసింది. సర్పంచులకు అధికారులు సర్టిఫికెట్ అందజేశారు. సర్పంచులు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి అధికారుల శిక్షణ తమకు సంతృప్తిని కలిగించిందన్నారు.
RR: కేశంపేట మండలం బైర్ ఖాన్ పల్లి గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బండ లాగుడు పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హాజరై పోటీలను వీక్షించారు. పోటీలలో ఎవరికి వారు విజేతలుగా నిలవాలని పెద్ద ఎత్తున పాల్గొనడంతో పోటీలు రసవత్తరంగా సాగాయి.