NRPT: ధన్వాడ మండలంలోని వివిధ గ్రామాలలో హోలీ పండుగ వేడుకలను మంగళవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో సోమవారం రాత్రి కామ దహనం నిర్వహించారు. మంగళవారం ఉదయమే యువకులు ఆయా గ్రామాలలో తిరిగి రంగులు చల్లుకున్నారు.హోలీ ఖుషి అంటూ డబ్బులు జమ చేసుకొని విందు భోజనాలు ఆరగించారు.
WNP: భువనగిరి మున్సిపల్ పరిధిలోని రాయగిరి సోమా రాధాకృష్ణ ఫంక్షన్ హాల్ వద్ద పాత ట్రాన్స్ ఫార్మర్ సమస్యను పరిష్కరిస్తూ నూతన ట్రాన్స్ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. 4వ వార్డు కౌన్సిలర్ నాయిని అరుణ పూర్ణచందర్ చొరవతో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.
KNR: కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ కోర్సుల 2, 4, 6వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ ను అధికారులు విడుదల చేశారు.వ అపరాధ రుసుం లేకుండా మార్చి 13 వరకు, రూ.300 ఆలస్య రుసుముతో మార్చి 18 వరకు ఫీజు చెల్లించవచ్చని పరీక్షల నియంత్రణ అధికారి డా. సురేశ్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్సైట్ చూడాలన్నారు
JGL: జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవయిత్రి, రుద్రమ సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షురాలు డా. చిందం సునీత రచించిన కాలం ఒడిలో కవితా సంకలనాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యా వేత్త, రచయిత ఎంవీ నరసింహారెడ్డికి ఈ కవితా సంకలనాన్ని అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా కవయిత్రిని కళాశ్రీ అధినేత గుండేటి రాజు, పలువురు అభినందించారు.
BHPL: జిల్లా వైద్య కార్యాలయంలో సోమవారం సాయంత్రం DMHO డా.మధుసూదన్ ఆధ్వర్యంలో RBSK వైద్యాధికారులు, జిల్లా ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ నెల 4 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుందని తెలిపారు.
SRD: కేతుగ్రస్తు చంద్రగ్రహణం సందర్భంగా ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయాన్ని ఈరోజు ఉదయం తాత్కాలికంగా మూసివేశారు. ఇవాళ మబ్బున 5 గంటలకు పార్వతి సమేత సంగమేశ్వర స్వామికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేసి మంగళ హారతులు ఇచ్చినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అయితే ప్రస్తుతం భక్తుల దర్శనాలు నిలిపివేశామన్నారు. ఆలయ సిబ్బంది ఉన్నారు.
KMR: సైబర్ నేరాల బారిన పడి ఆర్థికంగా నష్టపోయిన బాధితులకు తిరిగి నగదు పొందెందుకు తక్షణ సహాయం అందించేందుకు లీగల్ ఎయిడ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. బాధితులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 15100 లేదా సమీప పోలీస్ స్టేషన్, లేదా జిల్లా సైబర్ క్రైమ్ సెల్‌ను సంప్రదించాలన్నారు.
NRML: బాల్య వివాహాలను నిర్మూలించేందుకు జిల్లాలోని అన్ని గ్రామాలు, విద్యాసంస్థల్లో విస్తృత అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. 18 సంవత్సరాలలోపు బాలికలకు, 21 సంవత్సరాలలోపు బాలురకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాలు పిల్లల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.
NLG: దేశ భవిష్యత్తును నిర్దేశించే ప్రణాళికల్లో యువతను భాగస్వాములను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు NG కళాశాలను నోడల్ కేంద్రంగా ఎంపిక చేశారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 4లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
MDK: వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని తూప్రాన్ ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా తూప్రాన్ మండలం లింగారెడ్డిపల్లిలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడవి ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అగ్ని ప్రమాదాల వల్ల వన్యప్రాణులకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
KMM: చంద్రగ్రహణం సందర్భంగా ఖమ్మం నగరంలోని స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మంగళవారం ఉదయం 9 గంటలకు ఆలయ అధికారులు మూసివేశారు. తిరిగి బుధవారం ఉదయం తెరుస్తామని ఈవో కొత్తూరు జగన్మోహన్ రావు తెలిపారు. బుధవారం ఉదయం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేశాక 10 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు.
BHPL: జిల్లా ప్రజలకు, అధికారులకు హోలీ పండుగ సందర్భంగా MLA గండ్ర సత్యనారాయణ రావు శుభాకాంక్షలు తెలిపారు. హోలీ వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురు కావద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. చిన్నారులు, వృద్ధుల భద్రత పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని MLA గండ్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
BHPL: అన్నారం బ్యారేజ్ వద్ద అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని మహాదేవపూర్ డివిజన్-2 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమేష్ బాబు స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు సీడబ్ల్యూపీఆర్ఎస్ పుణే ఆధ్వర్యంలో పరీక్షల కోసం మాత్రమే డీసిల్టేషన్ జరుగుతోందన్నారు. ప్రజలు దుష్ప్రచారాలను నమ్మవద్దని ఆయన సూచించారు.
GDWL: హోలీ పండుగను శాంతియుతంగా, సహజ రంగులతో జరుపుకోవాలని రాజోలి ఎస్సై గోకారి సూచించారు. ఇష్టం లేని వ్యక్తులపై లేదా వాహనాలపై బలవంతంగా రంగులు చల్లరాదని హెచ్చరించారు. యువత ప్రమాదకర నదులు, చెరువుల్లో స్నానాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. బాధ్యతాయుతంగా పండుగ జరుపుకోవాలని తెలియజేస్తూ మండల ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
MBNR: జడ్చర్ల మండలం తుప్పడగడ్డతండాలో రాజేష్ (29) ట్రాక్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి వాగు నుంచి ఇసుక తెస్తుండగా ట్రాక్టర్ గుంతలోకి దిగడంతో అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.