JN: స్టేషన్ ఘన్‌పూర్ మాజీ MLA, తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్. తాటికొండ రాజయ్య జన్మదిన సందర్భంగా సోమవారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో మాజీ CM KCRను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా KCR, రాజయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో BRS ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
MNCL: గోమాతను జాతీయ ప్రాణిగా గుర్తించాలని విశ్వహిందూ పరిషత్ గో వంశ రక్షణ సంవర్ధన సమితి రాష్ట్ర సంపర్క ప్రముఖ్ ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి కోరారు. లక్షిట్టిపేట మండలంలోని వెంకట్రావుపేటలో రెండు మండలాల సమితి సభ్యుల సమావేశం నిర్వహించారు. అనంతరం రెండు మండలాల గోరక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ కరీంనగర్ నగర అధ్యక్షులు రమేష్ ఉన్నారు.
HYD: బేగంపేటలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పార్కులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రధానంగా నిబంధనలు ఉల్లంఘించే వారిలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పోలీసులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. డ్రంక్ & డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారు, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఇతర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారు ఈ సదస్సుకు హాజరయ్యారు.
JN: జిల్లా నూతన కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కలిశారు. జనగామ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను కలెక్టర్‌కు ఎమ్మెల్యే వివరించి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై క్షుణ్ణంగా చర్చించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు ఉన్నారు.
VKB: పెద్దేముల్ మండల పరిధిలోని మన్సాన్ పల్లి శివారులో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే కారు కుడి భాగం పూర్తిస్థాయిలో ధ్వంసమైంది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
VKB: దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన వికారాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. వికారాబాద్ పట్టణంలోని గరీబ్‌నగర్ కాలనీలో రాత్రి 2:45 నిమిషాలకు దొంగతనానికి వచ్చిన వ్యక్తిని కాలనీ వాసులు పట్టుకుని వికారాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
NZB: మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను సోమవారం కలెక్టరేట్లో నిర్వహించారు. అధికారికంగా నిర్వహించిన జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ శ్రీపాదరావు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్ అదనపు కలెక్టర్ (ఎల్‌బీ), మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, DRDO సాయ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
BDK: పదవి విరమణ పొందిన పాల్వంచ నవభారత్ కర్మాగారం విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై కృషి చేస్తామని DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన కొత్వాల సతీమణి, 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి ని నవభారత్ విశ్రాంత కార్మికులు సోమవారం ఘనంగా సన్మానించారు.
MBNR: ఉదండాపూర్ ప్రాజెక్టు ముంపు బాధితులు మరోసారి ఆందోళన బాట పట్టారు. నష్టపరిహారం ఆరు నెలల్లో ఇప్పిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, తొమ్మిది నెలలు గడిచినా స్పందించకపోవడంతో నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల్లో భారీ ధర్నా చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు అనుమతి కోరుతూ సీఐ కమలాకర్‌కు ఇవాళ వినతి పత్రం అందజేశారు.
HNK: కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ప్రశాంతంగా ముగిసింది. టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు మాజీ కుడా ఛైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ బహుమతులను ప్రధానం చేశారు. విద్యార్థులు కాలంతో పాటు పరిగెత్తుతూ భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని మాజీఛైర్మన్ అన్నారు. ABSF ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నరేష్, తదితరులు పాల్గొన్నారు.
BHNG: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చన 62 అర్జీలను స్వీకరించారు. వాటిని పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
SDPT: రసాయనిక రంగుల వల్ల కలిగే హానిని నివారించేందుకు గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రసాయన శాస్త్ర విభాగం, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో విద్యార్థులు వివిధ రకాల పూలతో సహజ సిద్ధమైన రంగులను తయారు చేసి ప్రదర్శించారు. వైస్ ప్రిన్సిపాల్ గణపతిరావు మాట్లాడుతూ.. చర్మవ్యాధులకు కారణమయ్యే రసాయనాలకు దూరంగా ఉండాలన్నారు.
KNR: పోగొట్టుకున్న మొబైల్‌ను CEIR టెక్నాలజీ ద్వారా కనుక్కొని బాధితునికి అందించినట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. జనవరి 28న గంగాధర తిరుపతి అనే వ్యక్తి తన ఫోన్‌ను తీగలగుట్టపల్లిలో పోగొట్టుకున్నానని ఫిర్యాదు చేశాడు. CEIR టెక్నాలజీ ద్వారా జగిత్యాలలో ఉన్నట్లు కనుక్కొని ఫోన్ యజమాని తిరుపతికి అందించారు.
MDK: నర్సాపూర్ డివిజన్ కేంద్రంలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను ఆర్డీవో రామకృష్ణ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించిన ఆయన, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. వేసవి నేపథ్యంలో పరీక్ష గదుల్లో నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
NLG: నార్కట్ పల్లి మండలం గోపలాయపల్లి గుట్టపై ఉన్న హరి-హర క్షేత్రమైన శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి, శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవస్థానాలు మార్చి 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మార్చి 4 ఉదయం 6 గంటల వరకు మూసివేస్తారు. 3న జరిగే పౌర్ణమి కళ్యాణం రద్దు చేయబడిందని, ఇది తిరిగి చైత్ర మాసంలో జరుగుతుందని ఛైర్మన్ మోహన్ రెడ్డి తెలిపారు.