NLG: చిట్యాల పురపాలికలోని 4వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పై మూత లేకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. దుర్వాసన భరించలేకపోతున్నామని వాపోయారు. దోమల వ్యాప్తి పెరిగి అనారోగ్యం బారిన పడుతున్నామని వార్డు ప్రజలు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి డ్రైనేజీపై మూతను ఏర్పాటు చేసి తమ సమస్యను పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
KMR: రామారెడ్డి మండలంలోని పోసానిపేట గ్రామానికి చెందిన నారెడ్డి సునంద గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆమె ప్రాథమిక విద్యను సొంత ఊరిలో, పదో తరగతి వరకు రామారెడ్డి జడ్పీహెచ్ఎస్ఈ అభ్యసించారు. మారుమూల గ్రామం నుంచి వెళ్లి హైదరాబాద్లో ఉన్నత పదవిని అధిష్ఠించడం పట్ల గ్రామస్థులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ASF: చింతలమానేపల్లి మండలం రణవెల్లి SC కాలనీలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. బోర్వెల్ సౌకర్యం లేకపోవడంతో నివాసితులు ట్రాక్టర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నారు. ప్రతి వేసవిలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని మహిళలు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారంగా బోర్వెల్ ఏర్పాటు చేయాలని MLA హరీశ్ బాబును కోరారు.
HNK: ఎల్కతుర్తి మండలం సూరారం, దండేపల్లి గ్రామాలకు చెందిన పలువురు నేతలు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కలిశారు. గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించి గ్రామాల్లో నెలకొన్న సమస్యలు సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఆయన్ను వారు కోరారు. బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ చిరంజీవి, నేతలు మధుకర్, మధు, సంపత్ రావు తదితరులు ఉన్నారు.
MBNR: ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహావిష్కరణ పోస్టరు మిడ్జిల్లో కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. వచ్చే నెల 8న కల్వకుర్తిలో విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుందని వారు తెలిపారు. అణగారిన వర్గాల కోసం పోరాడిన గద్దర్ స్మారక కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలోని వివిధ సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కమిటీ పిలుపునిచ్చింది.
WNP: శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచల సీతారాముల కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటికే చేరవేసేలా టీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్టింది. జిల్లా డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ శుక్రవారం ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. తలంబ్రాలు కావాల్సిన వారు 9154298609, 7382829379 నెంబర్ ద్వారా బుక్ చేసుకోవాలని ఆయన కోరారు.
KNR:ఎ ల్ఎండీ జలాశయం ప్రస్తుతం వ్యర్థాలతో నిండి డంపింగ్ యార్డును తలపిస్తోంది. చుట్టుపక్క ప్రాంతాల్లో చికెన్ సెంటర్ నిర్వాహకులు మాంసం వ్యర్థాలను, పలువురు చెత్తా చదారాలను జలాశయ తీరంలోనే పారవేస్తున్నారు. దీంతో గాలి వీచినప్పుడు, వర్షం పడినప్పుడు ఈ వ్యర్థాలన్నీ నీటిలోకి కొట్టుకుపోయి జలాశయం కలుషితమవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
WNP: దివ్యాంగులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. కొత్తకోట మండలంలోని పాలెం గ్రామంలో దివ్యంగుడు కావలి వెంకటయ్య కు స్కూటీని అందజేశారు. ఈ త్రిచక్ర స్కూటీలు వారికి రోజువారీ జీవనంలో పెద్ద ఉపశమనం కలిగిస్తాయని పేర్కొన్నారు.
MNCL: బెల్లంపల్లి మున్సిపల్ ఛైర్మెన్ స్వాతి, వైస్ ఛైర్మన్ సత్యనారాయణ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. ముఖ్యఅతిథిగా హాజరైన MLA వినోద్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణాభివృద్ధే లక్ష్యంగా పాలకవర్గం పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేయాలన్నారు
SRD: ప్రతి ఒక్కరికీ హిందూ ధర్మంపై అవగాహన ఉండాలని మాత బ్రహ్మనందా మాయి ట్రస్ట్ అధినేత బ్రహ్మనందా మాయి అన్నారు. హైదరాబాద్లో ఆమెను న్యాల్కల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు ఓంకార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలని, నిత్యం ఆధ్యాత్మిక చింతన అలవరుచుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో డా.జనార్దన్ రెడ్డి, నర్సప్ప పాల్గొన్నారు.
RR: గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన, పరివార దేవతల విగ్రహ ప్రతిష్టాపన, భోగ్ బండారో ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని రేపు షాద్‌నగర్ పట్టణంలో నిర్వహించనున్నట్లు గిరిజన సంఘాల నేతలు తెలిపారు. టీచర్స్ కాలనీలోని దుర్గామాత దేవాలయం నుంచి ముఖ్య కూడలి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, ప్రతి తండా నుంచి నాయకులు పాల్గొనాలన్నారు.
KMM: ఖమ్మం వెలుగుమట్ల భూ నిర్వాసితులకు సంఘీభావంగా సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆందోళన చేస్తున్న క్రమంలో పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాటలో న్యూడెమోక్రసీ రాష్ట్ర సెక్రటేరియట్ నాయకులు అవునూరి మధు కింద పడ్డారు. దీంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స చేయించుకోగా, ఎడమ చేయి భుజంపై ఫ్రాక్చర్ అయినట్లు తెలిపారు.
SDPT: చేర్యాల పట్టణానికి చెందిన చుంచు వివేక్ అనారోగ్యంతో చికిత్స పొందుతుండగా, అతని పేదరికాన్ని గమనించి ‘చేర్యాల అంబేద్కర్ నగర్’ సభ్యులు అండగా నిలిచారు. దాతల నుంచి సేకరించిన రూ.24,000 నగదును శుక్రవారం వివేక్ కుటుంబానికి అందజేశారు. ఆపద కాలంలో స్పందించి ఆర్థికంగా సహకరించిన ప్రతి దాతకు ఈ సందర్భంగా వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
RR: కేశంపేట మండలం బైర్ ఖాన్ పల్లి గ్రామంలో ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గుండు పందెం పోటీలను ఏర్పాటు చేశారు. పోటీలలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో ఆధ్యాత్మికతతో పాటు సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని పోటీలను ప్రారంభించారు.
MLG: బండారుపల్లి 12వ వార్డులో ఇందిరమ్మ ఇంటికి నిర్మాణానికి ములుగు గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బానోతు రవిచందర్ భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ… ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజల సొంత ఇంటి కళ నెరవేరుతుందని, ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనుల్లో ప్రభుత్వం నియమ నిబంధనలను పాటిస్తూ పనులను సకాలంలో పూర్తి చేసుకోవాలన్నారు.