BHNG: లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈనెల 3న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా దర్శనీయ వేళలు ఇలా ఉన్నాయి. ఉ. 3 గంటలకు సుప్రభాతం, 3:30లకు తిరు ఆరాధన, బాల భోగం, ఆరగింపు, 4:30 నిజాభిషేకం, 5:15 సహస్రనామార్చన, 5:45 ఉభయ దర్శనాలు, 7:00 ఆలయం మూసివేత. 4వ తేదీన ఉదయం 3:00 ఆలయ సంప్రోక్షణ, 5:30 సుప్రభాతం, 6:00 ఆరగింపు, 7:30 నిజాభిషేకం, 8:15 అర్చన, 8:45 దర్శనాలు.
ADB: బోథ్ మండలం కన్గుట్టలో శబరిమాత 2వ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆడే గజేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన షెడ్డుకు ఆయన భూమిపూజ చేశారు. ఆధ్యాత్మికతతోనే సమాజంలో సేవాభావం పెంపొందుతుందని పేర్కొన్నారు.
JGL: ధర్మపురిలో మార్చి 3-5 వరకు తెప్పోత్సవం, డోలోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల నేపథ్యంలో బ్రహ్మ పుష్కరిణిని ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది పూర్తిగా శుభ్రం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కోనేరులో నీటిని మార్చి, పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. భద్రతా పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.
SRPT: బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరిన నేపథ్యంలో చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నడిగూడెం ఎస్సై అజయ్ కుమార్ కోరారు. ప్రయాణాల్లో, ముఖ్యంగా రాత్రి వేళల్లో భారీ బంగారు ఆభరణాలు ధరించవద్దని, పిల్లలకు నగలు వేసి ఒంటరిగా బయటకు పంపవద్దని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 100 లేదా 112కి కాల్ చేయాలన్నారు.
NZB: మెండోరా మండలం సోన్ పేట్‌లో కాకతీయ కెనాల్ నుంచి అమ్మవారి టెంపుల్ వరకు ఆదివారం సీసీ రోడ్డు పనులు ప్రారంభం అయినట్లు సర్పంచ్ తోట నర్సవ్వ-మల్కయ్య తెలిపారు. మంజూరు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌తో పాటు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
KMM: అసెంబ్లీ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల దాకా ఏ ఎన్నిక వచ్చినా తీర్పు ‘వన్ సైడ్’గానే ఉందని, ఇది జీర్ణించుకోలేని గత పాలకులు ఒంటి నిండా విషాన్ని నింపుకుని చిమ్ముతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు, ఆ భగవంతుడు వారికి తగిన బుద్ధి చెప్పడం ఖాయం” అని చెప్పారు. ప్రజలు తమ వైపే ఉన్నారని పేర్కొన్నారు.
NRML: భైంసా మండలం పాంగ్రి గ్రామంలో ఆదివారం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. శివాజీ మహారాజ్ చరిత్ర యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ప్రజా ట్రస్ట్ ఛైర్మన్ మోహన్ రావు పటేల్, తదితరులు పాల్గొన్నారు.
KNR: మానకొండూర్ ప్రాంతంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. అర్చకులు ఉదయం ప్రధానాలయంలో పూజలు నిర్వహించి సాయంత్రం మంగళ వాయిద్యాలతో వేద పండితులు స్వామి వారిని చింతామణి చెరువు కట్ట వద్దకు తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ జక్కుల, పురపాలక సంగమ అధ్యక్షులు పాల్గొన్నారు.
WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో దోమల నివారణకు సర్పంచ్ తక్కలపల్లి శ్రీనివాస్ చర్యలు చేపట్టారు. ఆదివారం గ్రామ పరిధిలోని డ్రైనేజ్ కాలువల్లో GP సిబ్బంది చేత బ్లీచింగ్ పౌడర్ చల్లి, దోమల నివారణ మందును పిచికారీ చేయించారు. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సోకకుండా గ్రామస్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు.
GDWL: అయిజలోని కర్నూల్-రాయచూరు అంతర్రాష్ట్ర రహదారి వంతెనపై ఏర్పడిన ప్రమాదకర గుంతపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు ఎస్సై శ్రీనివాసులు తక్షణమే స్పందించారు. ఆదివారం జేసీబీ సహాయంతో ఆ గుంతను పూడ్చి మరమ్మతులు చేయించారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్న ఎస్సైను వాహనదారులు అభినందించారు.
BDK: సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజలు తమ తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని సూచించారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
KMM: కూల్చిన చోట పేదలకు 100 గజాల్లో ఇల్లు నిర్మించి ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం అంబేద్కర్ భవన్లో పునరావాసం ఉంటున్న భూదాన్ బాధితులను ఆయన పరామర్శించి మాట్లాడారు. పేదల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందని తెలిపారు.
SDPT: దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట శివారులో అనుమానాస్పద ఘటన చోటుచేసుకుంది. చౌదర్పల్లికి వెళ్లే రహదారిపై గుర్తుతెలియని వ్యక్తులు టూ వీలర్ వాహనం ముందు, వెనక చక్రాలను తొలగించి అదే స్థలంలో వదిలి వెళ్లారు. వాహనం ఇలా అక్కడ కనిపించడంతో స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. A
MDK: తూప్రాన్ పట్టణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ విగ్రహాల వద్ద వర్గీకరణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన మాదిగ అమరవీరులకు నివాళులర్పించారు. MRPS మెదక్ జిల్లా అధ్యక్షులు చెట్లపల్లి యాదగిరి మాదిగ ముఖ్య అతిథిగా హాజరు కాగా, నాయకులు సర్గల పరశురాములు, కాలకంటి సత్యం, సర్గల నరసింహులు, నాగులు, ఎర్ర యాదగిరి, గజ్జల యాదగిరి, ఎర్రోళ్ల స్వామి పాల్గొన్నారు.
NLG: రేషన్ సరుకులు మీ హక్కు, డీలర్ చేసే సాయం కాదు. తూకంలో తేడా ఉన్నా, డీలర్ దురుసుగా ప్రవర్తించినా వెంటనే ఫుడ్ అండ్ సివిల్ సప్లై శాఖ టోల్ ఫ్రీ నంబర్: 1967కు ఫిర్యాదు చేయవచ్చు. ఈ విషయంలో గ్రామీణ ప్రజానీకం అవగాహన కలిగి ఉండాలి. తెలంగాణ పౌరసరఫరాల శాఖ పోర్టల్ ద్వారా, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేస్తే అక్రమాలకు పాల్పడే డీలర్‌పై చర్యలు తీసుకుంటారు.