KNR: దళితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ MRPS జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ చిత్రా మిశ్రాకు వినతి పత్రం సమర్పించారు. అంబేడ్కర్ అభయ హస్తం పథకం కింద ప్రతి నిరుపేద దళిత కుటుంబానికి రూ.12 లక్షల రుణం మంజూరు చేయాలని, అసైన్మెంట్ భూములను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. లీడ్ క్యాప్ భూములను పరిరక్షించి పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని అన్నారు.
NZB: జిల్లా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ఆధ్వర్యంలో ఇటీవల మరణించిన సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వర్ కుటుంబానికి రూ. 75 లక్షల రూపాయల చెక్‌ను సోమవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో TPCC అధ్యక్షుడు, MLC మహేష్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, NZB రూరల్ MLA భూపతి రెడ్డి, ట్రెసా జిల్లా అధ్యక్షుడు రమన్ రెడ్డి ఉన్నారు.
KNR: కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల బోటనీ విభాగాధిపతి డా. తిరుకోవెల శ్రీనివాస్ సీఏఎస్ (CAS) ద్వారా లెవల్-14 ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. కాలేజియేట్ ఎడ్యుకేషన్ పరిధిలో ఈ పదోన్నతులు మొదటిసారి అమలు కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం కళాశాలలో వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ కె.రామకృష్ణ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.
JGL: జిల్లా కేంద్రంలోని డీసీఈబీ కార్యాలయంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 20 పాఠశాలల నుంచి ప్రహరీ క్లబ్ విద్యార్థులు, ఇన్‌ఛార్జ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి కె. రాము హాజరై ప్రహరీ క్లబ్ల ద్వారా పాఠశాలల్లో మాదకద్రవ్యాల రవాణా, వినియోగం జరగకుండా కాపాడాలని సూచించారు.
PDPL: ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మహిళల ఆరోగ్య సంరక్షణకు హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం ధర్మారం మండలం నందిమేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభమైంది. గ్రామ సర్పంచ్ వీర్ పాల్, ఉప సర్పంచ్ రవి ప్రారంభించారు. శిబిరంలో స్వశక్తి సంఘాల 35 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలు తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్‌కు పంపించారు.
SRCL: జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్కు చెందిన క్రీడాకారిణి ఎంపికైంది. గ్రామానికి చెందిన గుంటుక లయ హైదరాబాద్‌లోని డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుంది. ఇటీవల ఓయూలో నిర్వహించిన ఇంటర్ కాలేజియేట్ ఖోఖో ఛాంపియన్ షిప్ పోటీల్లో లయ పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచడంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికయింది.
JGL: ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం దేవాలయానికి మొత్తం రూ. 5,03,153 ఆదాయం వచ్చినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. టికెట్ల ద్వారా రూ.2,47,424, ప్రసాదాల విక్రయం ద్వారా .1,85,450, అన్నదానం ద్వారా.70,279 సమకూరినట్లు పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 45వ డివిజన్ పరిధిలోని తరాలపల్లి, కుమ్మరిగూడెం గ్రామాలకు చెందిన పలువురు BRS కార్యకర్తలు సోమవారం ఎమ్మెల్యే నాగరాజు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. అనంతరం MLA కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు. తదితరులు పాల్గొన్నారు.
NZB: జిల్లాలో ఇసుక రవాణాలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘మన ఇసుక వాహనం’ యాప్‌తో కూడా పూర్తి స్థాయిలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదన్న విషయం క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ఇసుక రవాణా తతంగాన్ని చూస్తే అర్థమవుతోంది. ‘మన ఇసుక వాహనం’ ప్రయత్నాలకు అధికారులే గండి కొడుతున్నట్లు తెలుస్తోంది.
SRPT: దేశంలో సెక్యులరిజానికి కాంగ్రెస్ పార్టీయే కేరాఫ్ అడ్రస్ అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ముస్లింలకు అండగా నిలిచేది తమ పార్టీయేననీ ఆయన అన్నారు.
MDCL: అల్వాల్ పట్టణంలో పంచశీల కాలనీ కమ్యూనిటీ హాల్‌లో నార్త్ అల్వాల్ సొసైటీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొమ్మిది కాలనీల మహిళలు కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెవిక్రిల్ లిప్పన్ ఆర్ట్ వర్క్‌షాప్, ర్యాంప్ వాక్, మురల్ పెయింటింగ్‌తో పాటు తంబోలా, డంబ్ చరాడ్స్, అంతాక్షరి వంటి వినోద కార్యక్రమాలు నిర్వహించారు.
HYD: మార్చి 25, 26 తేదీల్లో HYDలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన విద్యావేత్తలు, పరిశోధకులు, నిపుణులు హాజరుకానున్నారు. దూరవిద్య ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాల విస్తరణపై ప్రధానంగా చర్చలు జరగనున్నాయి. విద్యా రంగంలో మారుతున్న పరిస్థితులు, నూతన సాంకేతికతలపై ప్రసంగాలు ఉండనున్నాయి.
BDK: కొత్తగూడెం స్థానిక వివేకవర్ధని డిగ్రీ & పీజీ కళాశాలలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సైబర్ క్రైమ్ డీఎస్పీ అశోక్ కుమార్, ఎస్సై జితేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆన్‌లైన్ మోసాలు, ఫిషింగ్, సోషల్ మీడియా స్కామ్స్ గురించి విద్యార్థులకు వివరించారు.
MLG: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ మహేందర్‌కు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. రైస్ మిల్లు వ్యవస్థ నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతోందని, దానిని కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
PDPL సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని మార్కండేయ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణ పనులను, 7,8 వార్డుల కౌన్సిలర్లు ఊట్ల వరప్రదీప్, చింతల రాజు పరిశీలించారు. రూ.కోటి నిధులతో చేపట్టిన రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపించకుండా చూడాలని, అక్కడ పనులను పర్యవేక్షిస్తున్న డీఈ, ఏఈలను కోరారు. త్వరగా రోడ్డు నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు.