• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నేడు అన్ని పాఠశాలల్లో PTA సమావేశం

KMR: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నేడు తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం(PTA) నిర్వహించాలని DEO రాజు ఆదేశించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనాలన్నారు. విద్యార్థుల ప్రగతి, హాజరు శాతంపై టీచర్లు, తలిదండ్రులు చర్చించాలన్నారు. పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల పట్ల ఇంటి వద్ద ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా సూచనలు చేయాలన్నారు.

February 21, 2026 / 07:20 AM IST

నిర్జీవ స్థితిలో నవజాత శిశువు.. కాపాడిన 108 సిబ్బంది

KMR: పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గాంధారి మండలానికి చెందిన మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, పుట్టిన వెంటనే శిశువు ఏడవకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వైద్యులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. 108 వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యంలో శిశువు ఆరోగ్యం క్షీణించింది. సిబ్బంది సమయస్ఫూర్తితో ప్రాథమిక చికిత్స అందించి పసికందును కాపాడినట్లు తెలిపారు.

February 21, 2026 / 07:17 AM IST

కేజీబీవీ మెరిట్ జాబితా విడుదల

MBNR: జిల్లాలోని వివిధ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో (KGBV) ఖాళీగా ఉన్న ఏఎన్ఎం (ANM), అకౌంటెంట్, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల మెరిట్ జాబితాను జిల్లా విద్యాశాఖ విడుదల చేసింది. ఈ జాబితాను palamurubadi.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు డీఈవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. మెరిట్ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆయన సూచించారు.

February 21, 2026 / 07:16 AM IST

‘సర్వేయర్లు భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి’

MNCL: లైసెన్స్ సర్వేయర్ శిక్షణ పొందిన వారికి మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య ధ్రువపత్రాలు అందజేశారు. భూ సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన సర్వే పనులను లైసెన్సుడ్ సర్వేయర్లు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా పారదర్శకంగా నిర్వహించాలన్నారు. జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.

February 21, 2026 / 07:16 AM IST

‘కేంద్ర బడ్జెట్‌తో కార్మికులకు కష్టాలు.. కార్పొరేట్‌లకు పండగ’

BHNG: CITU జిల్లా కమిటి సమావేశం భువనగిరి పట్టణంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.మల్లికార్జున్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ కార్మిక వర్గాలకు తీవ్ర అన్యాయం చేసేదిగా, కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేదిగా ఉందని విమర్శించారు.

February 21, 2026 / 07:15 AM IST

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

NGKL: అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం మైసిగండిలో నూతన ఇళ్లను ప్రారంభించిన ఆయన, ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రేమ జవహర్ లాల్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

February 21, 2026 / 07:13 AM IST

బొలెరో వాహనాల అద్దాలు ధ్వంసం

JGL: ధర్మపురి పట్టణానికి చెందిన వేముల రాజేష్‌కు చెందిన 2 బొలెరో వాహనాల అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇంటి సమీపంలో నిలిపి ఉంచిన వాహనాల అద్దాలు పగులగొట్టడంతో పాటు టైర్లలో గాలి తీసివేసినట్లు తెలిసింది. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి తర్వాత జరిగినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై జి. మహేష్ తెలిపారు.

February 21, 2026 / 07:12 AM IST

గురుకుల ప్రవేశ పరీక్ష అన్ని ఏర్పాట్లు పూర్తి: DEO

నిర్మల్ జిల్లాలో ఈనెల 22న ఆదివారం నిర్వహించే గురుకుల ప్రవేశ పరీక్ష అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈవో భోజన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుందన్నారు. 5వ తరగతిలో ప్రవేశం కోసం జిల్లా వ్యాప్తంగా 6984 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

February 21, 2026 / 07:12 AM IST

చోరికి పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

SDPT: పట్ట పగలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న శివరాత్రి దివాకర్ అనే దొంగను రాజగోపాల్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. నాగరాజుపల్లిలో తాళం వేసి ఉన్న ముక్కెర వెంకటేశం అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు బీరువాలో ఉన్న మూడు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు 24 గంటల్లోనే దొంగను అరెస్ట్ చేసి, సొత్తును స్వాధీనం చేసుకున్నరు.

February 21, 2026 / 07:12 AM IST

‘ST విద్యార్థులు ఓవర్సీస్ విద్యానిధి పథకంకు దరఖాస్తు చేసుకోవాలి’

ASF: జిల్లాలోని ST విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరంలో విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని DTDO రమాదేవి ప్రకటనలో తెలిపారు. అర్హత గల విద్యార్థులు మార్చి 31వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ST విద్యార్థులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 21, 2026 / 07:11 AM IST

‘డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో మౌలిక వసతులు కల్పించాలి’

HNK: జిల్లాలోని న్యూశాయంపేట, అంబేద్కర్ నగర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం ఆమె ఇళ్లను పరిశీలించి, లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్, R&B అధికారులకు సూచించారు.

February 21, 2026 / 07:09 AM IST

ఆరుగురి అరెస్ట్.. పరారీలో నలుగురు..!

NZB: గంజాయిని విక్రయిస్తున్న ముఠాలోని ఆరుగురిని బాల్కొండలో అరెస్ట్ చేసినట్లు CP సాయి చైతన్య తెలిపారు. మహమ్మద్ అమ్హద్ అలీ, మహమ్మద్ నయీమ్, చిల్వేరు మనోజ్ కుమార్, జక్కుల గోవింద్, ఆద్నాన్‌తో పాటు ఓ మైనర్‌ను అరెస్ట్ చేశామన్నారు. మున్ని, వహీద్ సుల్తాన్, సోఫియాన్, మోసిన్ పరారీలో ఉన్నారన్నారు. ఈ సందర్భంగా 1.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

February 21, 2026 / 07:02 AM IST

కలెక్టర్‌ను కలసిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు

WGL: తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు మరిపల్లి చందన, గోగుల సరిత వరంగల్ జిల్లాలో సందర్శించిన సందర్భంగా నిన్న కలెక్టరేట్లో కలెక్టర్ సత్య శారదను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంలో వరంగల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్పర్సన్ వసుధ, సభ్యులు సుజాత, రామలీల తదితరులు ఉన్నారు.

February 21, 2026 / 07:01 AM IST

ఖమ్మం రెవెన్యూ శాఖలో 15 మందికి పదోన్నతులు

KMM: ఖమ్మంలో రెవెన్యూ శాఖలో పదోన్నతులు పొందిన 15 మందికి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నియామక పత్రాలు శుక్రవారం అందజేశారు. జవాబుదారీతనంతో పనిచేసి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని సూచించారు. డ్రాఫ్టింగ్, కంప్యూటర్ వినియోగంపై పట్టు సాధించాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ట్రెసా ప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

February 21, 2026 / 07:00 AM IST

తేరట్ పల్లిలో మార్కండేయస్వామి బ్రహ్మోత్సవాలు

NLG: గట్టుప్పల్ మండలం తేరట్ పల్లిలో శ్రీ మార్కండేయస్వామి 81వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక శోభతో విలసిల్లుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం కన్నులపండువగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

February 21, 2026 / 06:54 AM IST