Bandla Ganesh: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి పాగా వేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది. అన్నీ నియోజకవర్గాల్లో పరిస్థితులను అంచనా వేసి.. బలమైన అభ్యర్థులకు టికెట్లను కేటాయించనుంది. కూకట్ పల్లి నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దింపాలని అనుకుంది. అలా చూడగా.. నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ (Bandla Ganesh) పేరును పరిశీలనలోకి తీసుకున్నారని తెలిసింది. బండ్ల పోటీ తథ్యం అనే వార్తలు వచ్చాయి.
కూకట్ పల్లి నుంచి బరిలోకి దిగే అంశంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఎక్స్‌లో ట్వీట్ చేశారు. టికెట్ ఇస్తామని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారని.. తాను తిరస్కరించానని స్పష్టంచేశారు. తనకు టికెట్ ఇవ్వడం కన్నా ఈ సారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ముఖ్యం అని స్పష్టంచేశారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పనిచేస్తానని తెలిపారు.
టికెట్ ఇస్తానని రేవంత్ అన్న చూపిన ప్రేమకు కృతజ్ఞుడిని అంటున్నారు బండ్ల గణేశ్ (Bandla Ganesh). టికెట్ కోసం ఆప్లై చేయలేదని తేల్చిచెప్పారు. రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమాతో ఉన్నారు. 2018లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాకుంటే బ్లేడుతో గొంతు కోసుకుంటానని సవాల్ విసిరారు. ఆ సమయంలో ఓ మీడియా ప్రతినిధి బ్లేడ్, స్వీట్ బాక్స్ తీసుకొని వెళ్లగా.. అప్పట్లో అదీ సంచలనంగా మారింది. దీంతో బండ్ల గణేశ్‌ను (Bandla Ganesh) అంతా బ్లేడ్ గణేశ్ అని పిలిచారు. ఈ ఇష్యూకు సంబంధించి తర్వాత సినిమాలో డైలాగ్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.