YS Sharmila Party: కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ టీపీ విలీనానికి ఫుల్ స్టాప్ పడింది. రెండు, మూడు విడతల వారీగా కాంగ్రెస్ హైకమాండ్‌తో చర్చలు జరిపిన కొలిక్కి రాలేదు. షర్మిల (Sharmila) డిమాండ్లను కాంగ్రెస్ అధిష్టానం పరిగణలోకి తీసుకోలేదని తెలిసింది. అందుకే పార్టీ విలీనం చేసేందుకు వెనకడుగు వేశారని విశ్వసనీయ సమాచారం.
ఎక్కడ తేడా కొట్టిందంటే..?
వైఎస్ జగన్ జైలులో ఉన్న సమయంలో వైసీపీ కోసం పాదయాత్ర చేసి పార్టీకి హైప్ తీసుకొచ్చారు షర్మిల(Sharmila). ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మెల్లిగా దూరంగా ఉన్నారు. తన అత్త గారు తెలంగాణ అని ఇక్కడ పార్టీని ఏర్పాటు చేశారు. రాజన్న బిడ్డను వచ్చానంటూ జనంలోకి వెళ్లారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా పాదయాత్ర చేసి జనంతో కలిసిపోయారు. పార్టీకి కొంచెం గుర్తింపు వచ్చింది. కనీసం ఒక్క సీటు అయినా ఆ పార్టీ గెలుస్తోందని అభిప్రాయం వ్యక్తమయ్యింది. ఇంతలో కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపు వచ్చింది. పలు దఫాలుగా చర్చలు జరిగాయి.
డీకే శివకుమార్ కీ రోల్
కర్ణాటక కాంగ్రెస్ ముఖ్య నేత, డిప్యూటీ చీఫ్ మినిష్టర్ డీకే శివకుమార్‌ను బెంగళూరులో షర్మిల కలిశారు. ఆయన పుట్టిన రోజున కలువడంతో ఒక్కసారిగా ప్రాధాన్యం ఏర్పడింది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పదవీ చేపట్టిన తర్వాత మరోసారి మీట్ అయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరిక గురించే అనే అంశం కన్ఫామ్ అయ్యింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు బెంగళూర్ వెళ్లి డీకేను కలువడంతో.. షర్మిల ఇక కాంగ్రెస్ పార్టీలో చేరడమే తరువాయి అనుకున్నారు అంతా.. కానీ చివరలో ఇరువురి మధ్య చర్చలు అసంతృప్తిగా ముగిశాయి. దాంతో షర్మిల బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చింది.
కొలిక్కి రానీ అంశం ఇదే..?
షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. ఏపీలో ఆమె సేవలను వాడుకోవాలని కాంగ్రెస్ హై కమాండ్ భావించింది. అక్కడ పనిచేసేందుకు షర్మిల అంగీకరించలేదు. ఎందుకంటే తన సోదరుడు జగన్ పార్టీ అధికారంలో ఉండటంతో వెనుకడుగు వేసినట్టు తెలుస్తోంది. అక్కడ పనిచేయాలని కాంగ్రెస్ బెట్టు చేయడంతో చర్చలకు అక్కడే ఎండ్ కార్డ్ పడింది. తెలంగాణలో ఉండాలని.. పాలేరు నుంచి పోటీ చేయాలని షర్మిల అనుకున్నారు. తెలంగాణలో పనిచేసేందుకు కాంగ్రెస్ నేతలు.. ముఖ్యంగా టీ పీసీసీ చీఫ్ రేవంత్‌కు ఇష్టం లేదని తెలిసింది. అలాగే పాలేరు సీటు ఇచ్చేందుకు కూడా ఆలోచించారని సమాచారం. పాలేరు సీటు ఇవ్వకపోయినా ఫర్లేదు.. తెలంగాణలో ప్రచారం చేస్తానని చివరి మాటగా షర్మిల చెప్పినా.. ఆమె డిమాండ్‌కు కాంగ్రెస్ హైకమాండ్ ప్రాధాన్యం ఇవ్వలేదని విశ్వసనీయ సమాచారం. తన మాటకు విలువ లేనప్పుడు పనిచేయడం ఎందుకు అనే భావనకు షర్మిల వచ్చి.. ఇక పార్టీని విలీనం చేయొద్దని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ఇక్కడి నుంచి పోటీ
ముందు అనుకున్నట్టుగానే పాలేరు నుంచి షర్మిల బరిలోకి దిగుతారు. తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల నుంచి రెండు, మూడు రోజుల్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం అనే చర్చలతో ముఖ్య నేతలు కొండా రాఘవరెడ్డి, ఏపూరి సోమన్న వైఎస్ఆర్ టీపీని వీడారు. ఇప్పుడు ఆ పార్టీలో ముఖ్య నేతలు ఎవరూ లేకుండా పోయారు. గతంలోనే గట్టు రామచంద్రారావు, ఇందిరా శోభన్ పార్టీని వీడిన సంగతి తెలిసిందే.