తాను పార్టీ మారడం లేదని.. ఏ ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా మారాలని చూడటం లేదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. పార్టీ మారుతున్నారనే ఊహాగానాలు రావడంతో.. ఈ మేరకు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు.
Sudheer Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. మెల్లిమెల్లిగా సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖలపై పట్టుసారిస్తున్నారు. ఇంతలో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గోడ దూకెందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. అందులో ప్రముఖంగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి (Sudheer Reddy) పేరు వినిపించింది. దీంతో ఆయన మీడియా ముందుకు వచ్చారు. ప్రజా సేవ చేయడానికి పార్టీ మారాల్సిన అవసరం లేదని సుధీర్ రెడ్డి (Sudheer Reddy) అంటున్నారు. తాను పార్టీ వీడటం లేదని.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. తానే కాదు.. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా గోడ దూకారని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేస్తామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి నాలుగైదు నెలల సమయం ఇస్తామని సుధీర్ రెడ్డి అంటున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకుంటామని స్పష్టంచేశారు. ఆ తర్వాత జనాల్లోకి వస్తామని పరోక్షంగా చెప్పారు. ఆస్పత్రిలో ఉన్న కేసీఆర్ను అందరూ నేతలు పరామర్శిస్తున్నారని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. ఆ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను పరామర్శించారని తెలిపారు. కానీ కొందరు ఆ అంశాన్ని కూడా విమర్శిస్తున్నారని చెప్పారు. ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు.