కొత్త రాష్ట్రం తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయమే చేస్తోంది. చేదోడు ఇవ్వాల్సిన కేంద్రం చేతులు విరిచేలా ప్రవర్తిస్తోంది. తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు దక్కిన ప్రయోజనం ఒక్కటంటే ఒక్కటీ లేదు. ఒక్క చోట కూడా తెలంగాణ అనే పదం బడ్జెట్ ప్రసంగంలో వినిపించలేదు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించింది. అలాంటి రాష్ట్రానికి కేంద్రం అండగా నిలవాల్సి ఉంది. తెలంగాణపై ఆది నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వం వివక్ష చూపుతూనే ఉంది. ఈ తొమ్మిదేళ్లల్లో తెలంగాణకు చెప్పుకోదగ్గ బడ్జెట్ ఒక్కసారి కూడా లేదు. చదవండి:కేసీఆర్ కు బూస్ట్.. మరో రాష్ట్రంలోకి బీఆర్ఎస్ పార్టీ
కేంద్రం నుంచి సహజంగా రావాల్సిన నిధులు మినహా ప్రత్యేకంగా ఒక్క రూపాయి కూడా తెలంగాణకు వచ్చే ఆస్కారం లేదు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ తో తెలంగాణకే ప్రయోజనాలు శూన్యమే అని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు, ఆర్థిక సంఘం సిఫారసులు, తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖలను బుట్టదాఖలు చేసింది. విభజన చట్టంలో పేర్కొన్న కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఒక్క జాతీయ ప్రాజెక్టు ప్రకటించలేదు. ఫార్మాసిటీ, డిఫెన్స్ కారిడార్, నిమ్జ్, చేనేత పరిశోధన కేంద్రం వంటి ప్రతిపాదనలు పట్టించుకోలేదు. ఏ ప్రాజెక్టు, ఏ గ్రాంటు కింద కూడా తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు జరగలేదు. తెలంగాణపై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపిస్తోందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేశారు.
పక్కన ఉన్న కర్ణాటకకు వెనుకబడి ప్రాంతాల అభివృద్ధి పేరుతో రూ.5 వేల కోట్లు ప్రకటించగా.. తెలంగాణ ఎప్పటి నుంచో అవే నిధులు రూ.1,350 కోట్లు ఇవ్వాల్సి ఉండగా వాటిని ఇవ్వలేదు. వ్యవసాయానికి, ఉపాధికి నిధులు కోత వేయడంతో రాష్ట్రంలోని రైతులు, ఉపాధి కూలీలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) నిధుల్లో వాటా పెంచకపోవడంతో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో మళ్లీ కోత పడనుంది. కేంద్రం విధానాలతో రాష్ట్రానికి ఈసారి రూ. 6వేల కోట్ల అప్పులకు కోత పడుతుందని ఆర్థిక శాఖ భావిస్తోంది. కేంద్రం తీరును బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుబడుతున్నారు. రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు ఉండీ కూడా తెలంగాణకు.. పోనీ వాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. ఇక వాళ్లు ఉండి ఏంటి ప్రయోజనమని బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నిలదీస్తున్నారు. అయితే ఈ బడ్జెట్ పై త్వరలోనే సీఎం కేసీఆర్ స్పందించే అవకాశం ఉంది. కేంద్రం వివక్షను జాతీయ స్థాయిలో ఎండగట్టే అవకాశాలు ఉన్నాయి.