»Nagam Who Met Cm Kcr Announced That He Will Join Brs
Nagam Janardhan Reddy: సీఎం కేసీఆర్‌ను కలిసిన నాగం..బీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటన
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత నాగం జనార్ధన్ రెడ్డి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. త్వరలోనే మంచి ముహూర్తం చూసుకుని బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు స్పష్టం చేశారు. నాగం రాకతో బీఆర్ఎస్ వర్గాల్లో సందడి వాతావరణం నెలకొంది.
కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి (Nagam Janardhan Reddy) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మంత్రి హరీశ్ రావులు (Harish Rao) కలిసి ముచ్చటించారు. నాగం నివాసంలోనే వీరు భేటీ అయ్యి రాజకీయ పరిణామాలపై చర్చలు జరిపారు. ఈ తరుణంలో నాగం జనార్దన్ రెడ్డిని కేటీఆర్ హరీశ్ రావులు బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నాగం మీడియాతో మాట్లాడుతూ..కార్యకర్తల కోరిక మేరకు కాంగ్రెస్‌కు (Congress Party) రాజీనామా చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనన ఎంతగానో కలచివేశాయన్నారు. అందుకే సీఎం కేసీఆర్ (Cm KCR)తో సమావేశమై బీఆర్ఎస్లో చేరికపై మాట్లాడుతానన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరుతానని తన కార్యకర్తల సాక్షిగా వెల్లడించారు.
అనంతరం ఆదివారం రాత్రి సీఎం కేసీఆర్‌ను నాగం జనార్ధర్ రెడ్డి ప్రగతి భవన్ (Pragati Bhavan)లో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్ఫగుచ్చం అందించి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని తెలిపారు. సీఎం కేసీఆర్‌ను కలిసిన తర్వాత మంచి ముహూర్తం నిర్ణయించుకుని బీఆర్ఎస్లో చేరనున్నట్లు స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ టికెట్‌ను ఆశించగా కాంగ్రెస్ పార్టీ ఆయనకు మొండిచేయి చూపడంతో ఆయన తన అనుచరులతో భేటీ అయ్యి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ను నాగం కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్ కార్యకర్తల్లో మరింత జోష్ వచ్చినట్లయ్యింది.