తెలంగాణ ప్రభుత్వంలో రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నారని, ఇది రైతు సర్కార్ అని తెలంగాణ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, జడ్పీ చైర్మన్ సరిత, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, వీఎం అబ్రహంతో కలిసి మార్కెట్ చైర్మన్ శ్రీధర్ గౌడ్, డైరెక్టర్ లతో మంత్రి నిరంజన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డుకు బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి చైర్మన్ గా ఎంపిక కావడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలోని రైతాంగం పెట్టుబడి కోసం ప్రతి పంటకు ఎకరానికి రూ.5000 ఇస్తున్నారని తెలిపారు. రైతు బీమా అందజేస్తూ రైతు కుటుంబాలను ఆదుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. రైతు బంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 2022 నాటికి 64 లక్షల మంది రైతులకు రైతుబంధు సకాలంలో అందుతున్నదన్నారు. రైతు సర్కార్ గా పేరుగాంచిన తెలంగాణ ప్రభుత్వం నిరంతరం రైతుల అభివృద్ధి కోసమే పనిచేస్తుందని అన్నారు.
మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో రైతులకు సముచిత స్థానం కల్పించిందని, తెలంగాణలో ఏ ప్రాంతానికి లేని ఆవశ్యకత నడిగడ్డకు ఉందన్నారు. నడిగడ్డ ప్రాంతంలో పంటలు కళకళలాడుతున్నాయని, తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన రైతు సంక్షేమ పథకాల వల్ల రైతులు నిలదొక్కుకున్నారని మంత్రి తెలిపారు. రైతులకు రైతుబంధు, కులవృత్తులకు, మత్స్యకారులకు రుణాలు, దళితులకు దళిత బంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాలతో అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి ఆదుకుంటున్నారని తెలిపారు.
జడ్పీ చైర్మన్ సరిత మాట్లాడుతూ.. రైతులకు సేవ చేసే అవకాశం శ్రీధర్ గౌడ్ కు రావడం ఎంతో అదృష్టం అని అన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రం పాడిపంటలతో కళకళలాడుతున్నదని, ముఖ్యమంత్రి రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు.
గద్వాల ఎమ్మెల్యే పండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి శ్రీధర్ గౌడ్ కృషి చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మార్కెట్ యార్డులకు 365 రోజులు పంట ఉత్పత్తులు వస్తున్నాయని ఆయన తెలిపారు. ఉచిత విద్యుత్, రైతుబంధు సాగునీటి వినియోగం వల్ల పంట ఉత్పత్తులు పెరిగాయని, మార్కెట్ యార్డుకు తీసుకువచ్చే రైతన్నలకు సరైన మద్దతు ధర లభిస్తుందని తెలిపారు.
అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని రైతు సంక్షేమ పథకాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే అమలవుతున్నాయన్నారు. అనంతరం మార్కెటింగ్ శాఖ అధికారి పుష్ప, మార్కెట్ చైర్మెన్, డైరెక్టర్ లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల ఫోరం చైర్మెన్ గట్టు తిమ్మప్ప, మున్సిపల్ చైర్మెన్ బి ఎస్ కేశవ్, గ్రంథాలయ చైర్మెన్ జంబు రామన్ గౌడ్, జిల్లా రైతు సమన్వయ సమితి అద్యక్షుడు చెన్నయ్య, వైస్ చైర్మెన్ సరోజమ్మ, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, తదితరులు పాల్గొన్నారు.