ప్రధాని మోడీపై మంత్రి మల్లారెడ్డి విరుచుకుపడ్డారు. బీజేపీ శ్రేణులు కొండలా భావించే ప్రధాని మోడీ, దేశానికి పట్టిన అనకొండ అని విరుచుకుపడ్డారు. ఖమ్మం బీఆర్ఎస్ సభకు జనసందేహాం తరలివచ్చిందని తెలిపారు. సీఎం కేసీఆర్‌కు జనం మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఇక బీజేపీ పని అయిపోయిందని వివరించారు. బీజేపీ అట్టర్ ప్లాప్ అని, ఆ పార్టీ విశ్వాసం కోల్పోతుందని చెప్పారు. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని తెలిపారు. జనం ఏమీ కొనేట్టు పరిస్థితి లేదన్నారు. మోడీ సర్కార్‌పై జనం కోపంతో ఉన్నారని గుర్తుచేశారు.
బీజేపీ నేతలను వదల్లేదు. వారివి పాచిపోయిన ముఖాలని, వారికి ఫేస్ వాల్యూ లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారం ఉన్నా వారికి అభివృద్ధి చేసే సత్తా లేదన్నారు. దేశంలో 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందన్నారు. ఒక్క రాష్ట్రంలో అయినా తెలంగాణ మాదిరిగా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలలో ఒక్కరైనా తెలంగాణ మోడల్ చూపిస్తే తన మంత్రి పదవీకి రాజీనామా చేస్తానని మల్లారెడ్డి సవాల్ విసిరారు. కేంద్రంలోని బీజేపీకి ఐటీ, ఈడీ దాడులు చేయించటం తప్ప మరేం చేతకాదని విమర్శించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే చరిత్ర అని మల్లారెడ్డి గుర్తుచేశారు. దేశాన్ని తెలంగాణ మోడల్ చేయడమే కేసీఆర్ లక్ష్యం అని తెలిపారు. ఖమ్మం బీఆర్ఎస్ సభ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. సభకు ప్రజలే స్వచ్ఛందంగా తరలివస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ అవతార పురుషుడు అని, దేశాన్ని అభివృద్ధి చేయడానికే జన్మించారని కొనియాడారు. తెలంగాణ మోడల్‌ను దేశ వ్యాప్తం చేయడానికే కేసీఆర్ కంకణం కట్టుకున్నారని వివరించారు. కేంద్ర, రాష్ట్రాల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తేల్చిచెప్పారు. మిగతా ఏ పార్టీకి అంత సీన్ లేదని పేర్కొన్నారు.