తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజుల్లో 2013-14 బడ్జెట్ ను చూసుకుంటే.. ఆ బడ్జెట్ లో ఉమ్మడి ఏపీలో చేనేత, జౌళీ శాఖకు కేటాయించింది రూ.70 కోట్లు. కానీ.. ఇవాళ సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేనేత, జౌళీ శాఖకు...
KTR : చేనేత కార్మికులను గత ప్రభుత్వాలు ఏనాడూ పట్టించుకోలేదు. ఇప్పుడు కేంద్రంలో ఉన్న పార్టీ కూడా పట్టించకోవడం మానేసింది. చేనేత కార్మికులకు ఉన్న పథకాలను కూడా రద్దు చేస్తూ పోతోంది. కానీ.. మేము మాత్రం పోరుగడ్డ మీద పేగు బంధం ఉన్న చేతన్నలందరినీ బతికించుకునే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ల బాగు కోసం ఎక్కని కొండలేదు.. మొక్కని బండలేదు అని తెలంగాణ మంత్రి కేటీఆర్ శాసనసభలో అన్నారు.
ఎన్నో సార్లు కేంద్ర మంత్రులను కలిసి.. సిరిసిల్లకు మెగా పవర్ లూం క్లస్టర్ మంజూరు చేయాలని కోరామని, జమ్మికుంట, కమలాపూర్కి హ్యాండ్ లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నెత్తి నోరు మొత్తుకున్నా కూడా కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదన్నారు. తెలంగాణ బడ్జెట్ పై జరుగుతున్న చర్చలో భాగంగా చేనేత, జౌళీశాఖలకు ఎంత కేటాయించారు.. ఎంత ఖర్చు చేస్తున్నారు అని సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
KTR : వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కలిగించే రంగాలు చేనేత, జౌళీ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజుల్లో 2013-14 బడ్జెట్ ను చూసుకుంటే.. ఆ బడ్జెట్ లో ఉమ్మడి ఏపీలో చేనేత, జౌళీ శాఖకు కేటాయించింది రూ.70 కోట్లు. కానీ.. ఇవాళ సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేనేత, జౌళీ శాఖకు కేటాయింపులు ఎలా ఉన్నాయో అందరు చూస్తున్నారు. రికార్డు స్థాయిలో ఆయా శాఖలకు కేటాయింపులు చేసి చేనేత కార్మికులను ఆదుకుంటున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
భారత్ లో వ్యవసాయం తర్వాత అంత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగాలు చేనేత, జౌళీ అని.. వాటిని కాపాడుకుంటేనే అందరికీ పని దొరుకుతుందని మంత్రి తెలిపారు. కానీ.. చేనేత రంగాన్ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నేతన్నలను పట్టించుకోవడం మానేస్తే.. తమ ప్రభుత్వం మాత్రం కొత్త కార్యక్రమాలు తీసుకొస్తోందని, చేనేత మిత్ర పథకం కింద.. భారత్ మొత్తంలో నూలుపై, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని… ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కేటీఆర్ తెలిపారు.
KTR : చేనేతన్నకు చేయూత పథకంతో కార్మికుడికి సామాజిక భద్రత
కేంద్రం పట్టించుకోకున్నా.. చేనేతన్నకు చేయూత పథకం పేరుతో కార్మికుడి సామాజిక భద్రతను తీసుకొచ్చామని కేటీఆర్ అన్నారు. అలాగే.. పవర్ లూమ్ కార్మికుల కోసం థ్రిఫ్ట్ పథకం కింద కరోనా టైమ్ లో నేతన్నల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుందని స్పష్టం చేశారు. నేతన్నల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ల వ్యక్తిగత రుణాలు రూ.39 కోట్లను మాఫీ చేశారు. నేతన్న బీమా తీసుకొచ్చి రూ.5 లక్షలు అందిస్తున్నారు. నేతన్నలను చావగొట్టాలని చేనేత ఉత్పత్తులపై 5 శాతం పన్ను వేసింది కేంద్రం. పన్ను తగ్గించాలని ఎన్నిసార్లు కేంద్రానికి విన్నవించినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఉన్న 5 శాతాన్ని కూడా 12 శాతానికి పెంచేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందట. దాన్ని జీరోకు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని మేము బతిమిలాడుతుంటే.. 5 ను కాస్త 12 శాతం చేసి వాళ్ల నుంచి కూడా దోచుకోవాలని కేంద్రం చూస్తోంది అంటూ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.