Half Day Schools : వేసవి వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి. దీనికితోడు పలు ప్రాంతాల్లో కరెంటు కోతలతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ ఎండలో వృద్ధులు, చిన్న పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. వడదెబ్బకు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నందున ప్రతి ఏటా ప్రభుత్వాలు విద్యార్థులకు ఒంటి పూట బడులు నిర్వహిస్తుంటాయి. ఈ ఏడాది కూడా ఈ నెల 15 నుంచి హాఫ్ డే పాఠశాలలు ఉంటాయని తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. అంటే పాఠశాలలు మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే తెరవబడతాయి.
మార్చి ప్రారంభంలోనే ఎండలు తీవ్రంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ తెలిపింది. అయితే ప్రభుత్వ ఆదేశాలను సైతం లెక్క చేయకుండా సిలబస్ పూర్తి చేసి రోజంతా పాఠశాలలు నడిపేందుకు కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఉవ్విళ్లూరుతున్నాయి. గతం లో ఇలాంటి స్కూల్స్ చాలానే తారసపడ్డాయి. ఈసారి ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.