Akula Lalitha: బీఆర్ఎస్కి మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత రాజీనామా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గరవుతున్న వేళ పార్టీ నేతలు బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.
Akula Lalitha: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ పార్టీ మారుతున్న నేతల సంఖ్య పెరుగుతోంది. ఈక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. నిజమాబాద్ మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత సోమవారం(అక్టోబర్ 16)న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. బీఆర్ఎస్ హయాంలో పూర్తిగా ఎమ్మెల్యేల ప్రభుత్వంగా పరిపాలన సాగుతోంది. స్థానిక సంస్థల పాలన ఎమ్మెల్యేల బానిస పాలనగా మారింది. అందుకే పార్టీని వదిలిపెడుతున్న అని లేఖలో రాశారు. ఆరేళ్ల పాటు మీ నాయకత్వంలో పనిచేసేందుకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలని లేఖలో రాశారు. నిజమాబాద్ అర్బన్ కాంగ్రెస్ టికెట్ కావాలనుకుంటున్న లలిత త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేశారు. పార్టీ టికెట్ దక్కలేదని పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సమాచారం. ఆకుల లలిత 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆర్మూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2015లో తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి.. 2021, డిసెంబర్ 24న తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవికి కూడా లలిత రాజీనామా చేశారు.