ఎన్నికల వేళ తెలంగాణ (Telangana)పాలిటిక్స్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది.అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరికొన్ని రోజుల ముందే బీజేపీకి మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) బిగ్ షాక్ ఇచ్చారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. గత కొంతకాలంగా వినిపిస్తున్న పార్టీ మార్పు వార్తలను ఎట్టకేలకు నిజం చేశారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. ఎల్లుండి కాంగ్రెస్ (Congress) అగ్రనేతల సమక్షంలో కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వనున్నారు.
గతంలో మనుగోడు (Munugodu) కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన రాజీనామా చేసి బీజేపీలోకి చేరిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నా అంత చురుగ్గా లేరు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరమయ్యారు. రాష్ట్రంలో ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉందని, ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తెలిపారు. ఏడాది క్రితం వరకు బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా మారిన బీజేపీ (BJP) ఇప్పుడు డీలా పడిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ (BRS) కు కాంగ్రెస్సే ప్రత్నామ్నాయంగా భావిస్తున్నారని తెలిపారు. కాబట్టి తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంటున్నట్టు వివరించారు.