Telangana: ప్రజలకు అలర్ట్..కమ్మేస్తోన్న పొగమంచు, శీతల గాలులతో జాగ్రత్త!
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారింది. తెల్లవారుజామున పొగమంచు కమ్మేస్తోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
మొన్నటి వరకూ ఎండ తీవ్రతతో తెలంగాణ (Telangana)లోని చాలా ప్రాంతాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. ఉక్కపోతలతో ప్రజలు అల్లాడిపోయారు. అప్పుడప్పుడు కురిసే వర్షాలకు కాస్త ఉపశమనం పొందుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆ ఎండలు మొహం చాటేశాయి. రాష్ట్రంలో గజగజ ప్రారంభమైపోయింది. నైరుతి రుతుపవనాలు (Monsoon) తిరుగుముఖం పట్టాయి. దీంతో నాలుగైదు రోజుల నుంచి చలి అందర్నీ వణికిస్తోంది.
తెలంగాణలో పగలు, రాత్రి సమయాల్లో ఉక్కపోతలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం తెలంగాణ వైపు శీతల గాలులు (Cold Winds) వీస్తున్నాయని వాతావరణ శాఖ (Department of Meteorology) వెల్లడించింది. దీని వల్ల పలు జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు (Temperatures) సాధారణం కన్నా చాలా దిగువకు చేరుకున్నట్లు ప్రకటించింది. అలాగే తెల్లవారుజామున పొగమంచు కమ్మేస్తుండటంతో వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రంలోని హనుమకొండలో సాధారణం కన్నా 2.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీంతో అక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రత 19.5 డిగ్రీలు నమోదైనట్లు హైదరాబాద్ వాతారణ కేంద్రం వెల్లడించింది. అలాగే ఆదిలాబాద్లో 1.8 డిగ్రీలు తగ్గి 17.2 డిగ్రీలకు చేరుకుంది. రామగుండం, మెదక్, హనుమకొండలో పగటి ఉష్ణోగ్రతలు చాలా వరకూ తగ్గాయి. ఖమ్మంలో అయితే సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా నమోదవ్వడంతో గరిష్ఠ ఉష్ణోగ్రత 35.2 డిగ్రీలకు చేరుకుంది. ఇకపోతే భద్రాచలం, ఆదిలాబాద్ ప్రాంతాల్లో కూడా కొంచెం ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది.