»Kcr Should First Visit Kavitha In Jail Mla Yashaswini Reddy
MLA Yashaswini Reddy: కేసీఆర్ ఫస్ట్ కవితను పరామర్శించడానికి వెళ్లాలి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందు మద్యం కేసులో అరెస్టు అయి తీహార్ జైల్లో ఉన్న తన కూతురు కవితను పరామర్శించేందుకు వెళ్లాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఎద్దేవా చేశారు. రైతుల కష్టాలు కొత్తగా ఇప్పుడు గుర్తుకు వచ్చాయా అని విమర్శించారు.
KCR should first visit Kavitha in jail MLA Yashaswini Reddy
MLA Yashaswini Reddy: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ముందు మద్యం కేసులో అరెస్టు అయి తీహార్ జైల్లో ఉన్న తన కూతురు కవిత(Kavitha)ను పరామర్శించేందుకు వెళ్లాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి(Yashaswini Reddy) విమర్శించారు. కొత్తగా రైతు సమస్యలు అంటూ కేసీఆర్ మరో నాటకానికి తెరలేపారు అంటూ ఎద్దేవా చేశారు. దేవరప్పుల మండలం ధారావత్ తండాలో ఇటీవల కేసీఆర్ పర్యటించారు. రైతులతో మాట్లాడి ఎండిన పంటలను పరిశీలించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైకరికి నిదర్శనం అంటూ విమర్శలు చేశారు. దీనిపై పాలకుర్తి నియోజక వర్గ ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తమ నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేదన్నారు. ఒక రైతు అర ఎకరం పొలం ఎండిపోయిందని, అదీ గ్రౌండ్ వాటర్ లేక ఎండిపోయిందని అన్నారు. దాన్ని బూచీగా చూపిస్తూ.. బీఆర్ఎస్ నేతలు పదేపదే సందర్శిస్తూ ఆ పొలాన్ని టూరిస్ట్ స్పాట్‌గా మార్చారని ఎద్దేవా చేశారు.
ఆ పొలాన్ని మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు, హరీశ్ రావు, కేసీఆర్‌లు పదిరోజుల వ్యవధిలో సందర్శించారని తెలిపారు. ఆ పొలంలో వరుసగా నాలుగుసార్లు బోర్లు వేసినా నీళ్లు పడలేదని, పక్కనే ఉన్న మరో రైతు పొలంలో నీళ్లు వస్తున్నట్లు వెల్లడించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్లు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఫామ్ హౌస్ నుంచి అసెంబ్లీకి రాకుండా తప్పించుకున్న కేసీఆర్ ఇప్పుడు పొలాల్లో తిరగడం విడ్డూరం అని అన్నారు. అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, మాజీ మంత్రులు జైలుకు వెళ్తారన్న విషయం వాళ్లకు కూడా తెలుసని, దాన్ని పక్కదారి పట్టించడానికే కొత్త నాటకం ఆడుతున్నట్లు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి విమర్శించారు.