ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీలోకి చాలా మంది నేతలు వచ్చి చేరుతున్నారు. సీఎం కేసీఆర్ వారిని ఆహ్వానిస్తూ స్వాగతం పలుకుతున్నారు. తాజాగా నేడు బీఆర్ఎస్ పార్టీ తీర్థాన్ని మహారాష్ట్రకు చెందిన నేతలు పుచ్చుకున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. షోలాపూర్, నాగపూర్ ప్రాంతాలకు చెందిన పలువురు నేతలను పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తం విస్తరింపజేస్తామని తెలిపారు. మహారాష్ట్రలోని షోలాపూర్ లో త్వరలో భారీ ర్యాలీ, బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ మోడల్ అభివృద్ధి మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో ప్రతి రాష్ట్రంలోనూ జెండా పాతుతుందన్నారు.
మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను దేశ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. మహారాష్ట్ర రాజకీయాల్లో సొంత పార్టీలనే చీల్చుతున్నారని, పదవుల కోసం వేరే పార్టీల్లోకి వెళుతున్నారని, నాయకులు అలా ఉండకూడదని విమర్శించారు. అభివృద్ధి నిరోధకులను ఈసారి గెలిపించకూడదని మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ రూపంలో అభివృద్ధి ప్రజల ముందుకే వస్తుందన్నారు.