Will you give laddus to Gujarat. Peppermint to Telangana?
Harish rao, KTR: ప్రధాని మోడీపై తెలంగాణ మంత్రులు కేటీఆర్ (KTR), హరీశ్ రావు (harish rao) ఫైరయ్యారు. గుజరాత్‌కు లడ్డూ.. తెలంగాణకు పిప్పర్ మెంట్ ఇస్తారా అని విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల 45 ఏళ్ల కల కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ అని మంత్రి కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. గుజరాత్‌కి మాత్రం రూ.20 వేల కోట్లతో లోకోమోటివ్ ఫ్యాక్టరీ ఇచ్చారని మండిపడ్డారు. తమ రాష్ట్రానికి కేవలం రూ.520 కోట్లతో రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్ పెడుతున్నారని గుర్తుచేశారు. ఇదీ తెలంగాణ ప్రజలను అవమానించడమేనని పేర్కొన్నారు. దేశ చరిత్రలో అత్యధిక నిరుద్యోగం సృష్టించిన విఫల ప్రధాని నరేంద్ర మోడీ అని కేటీఆర్ (KTR) విమర్శించారు.
బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పున:ప్రారంభం, జాతీయ రహదారుల ప్రాజెక్ట్, కొత్త రైల్వే లైన్ల ఏర్పాటును పక్కన పెట్టారని కేటీఆర్ (KTR) వివరించారు. తెలంగాణ ప్రభుత్వం 2.20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ ఊసే మరచిపోయిందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగాలను ప్రైవేట్ పరం చేస్తూ.. తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సెంట్రల్ వర్సిటీల్లోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకు భయపడే ప్రసక్తే లేదని మంత్రి కేటీఆర్ (KTR) స్పష్టంచేశారు. పిట్ట బెదిరింపులకు కలవరపడే ప్రభుత్వం, నాయకత్వం తమది కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం మహాయజ్ఞంలా కృషి చేస్తామని కేటీఆర్ కుండబద్దలు కొట్టారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన పథకాన్ని కాపీ కొట్టింది మీరు కాదా అని మరో మంత్రి హరీశ్ రావు (harish rao) ప్రశ్నించారు. తమ పాలన బాగోలేకపోతే.. తమ పథకాలను ఎందుకు కాపీ చేస్తారని అడిగారు. ఢిల్లీలో అవార్డులు ఇచ్చి.. గల్లీలో తిడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణకు మీరు నిధులు ఇవ్వలేదు.. తమకు రావాల్సిన ఫండ్స్ ఆపారని తెలిపారు. నీతి ఆయోగ్ చెప్పినప్పటికీ బావుల వద్ద మీటర్లు పెట్టలేదని రూ. 21 వేల కోట్లు ఆపింది మీరు కాదా అని అడిగారు. తెలంగాణపై చిత్తశుద్ది ఉంటే ట్రైబల్ వర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీకు ఈడీ, సీబీఐ ఉండొచ్చు.. తమకు తెలంగాణ ప్రజలు అండగా ఉన్నారని తెలిపారు.