వైఎస్ రాజశేఖర్ రెడ్డి(Ys Rajasekhar Reddy) జయంతి రోజున వైఎస్ఆర్టీపీ(YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఆమె పోటీ చేసే ప్రాంతంపై కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పక్కాగా పోటీచేయనున్నట్లు వెల్లడించారు. గతంలో చెప్పినట్లుగానే పాలేరు నుంచే తాను పోటీ చేస్తానని తెలిపారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ.. పాలేరు మట్టి సాక్షిగా పాలేరు ప్రజలకు వైయస్ఆర్ సంక్షేమ పాలన అందిస్తానని తెలిపారు.
రైతులకు అండగా నిలబడతానని, ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టిస్తానని, పేద బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీలతో రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన తీసుకొస్తానని షర్మిల(YS Sharmila) హామీ ఇచ్చారు. మళ్లీ చెబుతున్నా.. రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను.. పులి కడుపున పులే పుడుతుంది.. మీ బిడ్డగా మీకు నమ్మకంగా సేవ చేస్తానంటూ షర్మిల ప్రకటన చేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలనను ప్రతి గడపకు చేరుస్తానని షర్మిల (YS Sharmila) మాటిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేశానని, అతికొద్ది రోజుల్లోనే మళ్లీ ఆ పాదయాత్రను పాలేరులో ప్రారంభించి 4000 కిలో మీటర్లు పూర్తి చేసి పాలేరులోనే ముగిస్తానని ప్రజల సమక్షంలో తెలిపారు. పాలేరు నియోజకవర్గంపై దృష్టిసారించిన షర్మిల పూర్తి స్థాయిలో అక్కడినుంచే పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.