మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పేరు చెప్పి పోలీసులు సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీల పేరుతో దొరికిన నగదు దొరికినట్లు సీజ్ చేస్తున్నారు. ఇదంతా ఎన్నికల్లో ఖర్చులకు ఉద్దేశించిందే అన్నట్లు హడావుడి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తీరు కనిపిస్తోంది.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు ఎన్నికల కోడ్(Election Code)తో సామాన్యులు ఇక్కట్లపాలవుతున్నారు.కోడ్ ఉన్నప్పుడు రూ.50 వేలకు మించి తీసుకెళ్లకూడదు. శుభకార్యాలకో,ఆస్పత్రి ఖర్చులకో,డబ్బుల్ని వెంట తీసుకెళ్లే ప్రజలకు ఇది ఇబ్బందికరంగా మారింది.ప్రతి రూపాయికి అధికారులు లెక్క చెప్పమంటున్నారు.మరోవైపు వివాహాల సీజన్ (Wedding season) మొదలైంది. దీంతో శుభకార్యాల నిమిత్తం బట్టల కొనుగోలు నుంచి పెళ్లిపందిరి వరకు ఆర్డర్లు ఇచ్చుకుంటున్నవారికి తనిఖీలతో ఇబ్బందులు తప్పడం లేదు. వివాహ వేడుకల లావాదేవీల్లో సగానికిపైగా నగదు రూపంలో జరుగుతుంటాయి. పెళ్లిపందిరి, భోజనం ఏర్పాట్లు, బాజాభజంత్రీలు ఇతరత్రా కలిపి పెళ్లి ఖర్చు కనిష్ఠంగా రూ.5 లక్షలపైనే అవుతుంది. ఇక దుస్తులు కొనేందుకు కనీసం రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర అవసరం. శుభకార్యాల పనుల నిమిత్తం ఇంటి నుంచి నగదుతో బయలుదేరినవారు.. అందుకోసమే తీసుకెళ్తున్నామంటూ పోలీసులను ప్రాధేయపడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.
‘‘వివాహ దుస్తుల కోసం నలుగురు బంధువులం కలిసి బయలుదేరాం. చీరల దుకాణానికి దగ్గర్లోనే పోలీసులు చెక్‌పోస్టు (Police checkpoint) ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. వారికి వాస్తవాలు వివరించి, ఆధారాలు చూపించేసరికి చెమటలు పట్టాయి’’ అని వ్యాపారులు తెలుపుతున్నారు. ఎన్నికల్లో నగదు ప్రవాహాన్ని(Cash flow) అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ విధించిన నగదు పరిమితి నిబంధన పేద, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఎన్నికల నియమావళి ప్రకారం ఒక్కో వ్యక్తి రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లకూడదు. ఒకవేళ తీసుకెళ్లినా కచ్చితమైన ఆధారాలు చూపించాలి. నగరాలు, పట్టణాల్లోనే కాదు.. మారుమూల గ్రామాల్లోనూ పోలీసులు (Police) చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. బ్యాగులనూ తెరిచి చూస్తున్నారు. రూ.50 వేలకు మించిన నగదుకు ఆధారాల్లేకుంటే సీజ్ చేస్తున్నారు.