»Cm Kcr Versus Etela Rajender In Assembly Over Diet Charges
KCR vs Etela : ఈటల రాజేందర్‌కు ఫోన్ చేయండన్న కేసీఆర్.. నన్ను గెంటేశారన్న ఈటల
అసెంబ్లీలో ఈటల రాజేందర్ గురించి పలు మార్లు సీఎం కేసీఆర్ ప్రస్తావిస్తున్న సమయంలో బీఆర్ఎస్ సభ్యులు ఘర్ వాపసీ అంటూ నినాదాలు చేశారు. ఆ వ్యాఖ్యలపై కూడా రాజేందర్ స్పందించారు. నా మీద చేసిన దాడిని మరిచిపోలేను. నేను పార్టీ మారలేదు
KCR vs Etela : తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ స్వయంగా సమాధానాలు చెప్పారు. ఈసందర్భంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరును పలుసార్లు సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. యూనివర్సిటీలలో చదువుతున్న విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచాలని ఈటల రాజేందర్ కోరగా.. దానిపై స్పందించిన సీఎం కేసీఆర్.. డైట్ చార్జీలు పెంచమని కోరారు. అది న్యాయ సమ్మతమైన కోరిక. మంత్రులు కూడా ఇక్కడే ఉన్నారు. హరీశ్ రావు, సబితారెడ్డి గారిని నేను కోరుతున్నా. రెండు మూడు రోజుల్లో జీవోను ఇష్యూ చేయండి. తప్పకుండా ఏ మేరకు పెంచాలో చూడండి. రాజేందర్ గారు చెప్పారని చేయొద్దని అనొద్దు. వారిని కూడా పిలుచుకోండి. కావాలంటే వారికి ఫోన్ చేయండి. వారి సలహా కూడా తీసుకోండి అని సీఎం కేసీఆర్ ఈసందర్భంగా మంత్రులతో అన్నారు.
ఆ తర్వాత అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్.. ఈ సభకు ఈటల రాజేందర్ వచ్చేది తెలంగాణ ప్రజల పక్షాన గొంతు విప్పడానికి వస్తాడు తప్ప.. ఈటల రాజేందర్ సొంత ఎజెండా ఉండదు గుర్తు పెట్టుకోండి. పరిష్కారం అయితే నేను సంతోషపడతా. ఎందుకు పోను.. తప్పకుండా పోతా నేను. విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న పేద విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచే సందర్భం వస్తే.. వంద శాతం పోతా నేను అన్నారు.
KCR vs Etela : ఘర్ వాపసీ నినాదాలపై కూడా స్పందించిన ఈటల
అయితే.. అసెంబ్లీలో ఈటల రాజేందర్ గురించి పలు మార్లు సీఎం కేసీఆర్ ప్రస్తావిస్తున్న సమయంలో బీఆర్ఎస్ సభ్యులు ఘర్ వాపసీ అంటూ నినాదాలు చేశారు. ఆ వ్యాఖ్యలపై కూడా రాజేందర్ స్పందించారు. నా మీద చేసిన దాడిని మరిచిపోలేను. నేను పార్టీ మారలేదు.. వాళ్లే నన్ను గెంటేశారు. గెంటేసిన వాళ్లు పిలిచినా పోను. నన్ను డ్యామేజ్ చేసేందుకు కేసీఆర్ మైండ్ గేమ్ తో అలా మాట్లాడారు. అబద్ధాన్ని ఇటూ అటూ ఆయన చెప్పగలరు. నన్ను ఇబ్బంది పెట్టడం కోసమే అలా మాట్లాడారు. నేను బీజేపీ సైనికుడిని. నిమిషానికి ఒక మాట మాట్లాడను. నాపై ఉన్న నమ్మకంతోనే హుజూరాబాద్ ప్రజలు నన్ను గెలిపించారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ ఆహ్వానించినా కూడా వెళ్లను.. అంటూ ఈటల రాజేందర్ కుండ బద్దలు కొట్టారు.