Rajaiah: డప్పు కొట్టాలన్నా, ఫ్లెక్సీ కట్టాలన్నా భయపడే పరిస్థితి
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. నియోజకవర్గంలో పరిస్థితులు కష్టంగా ఉన్నాయని.. ఇక తాను రావాల్సిన అవసరం లేదన్నారు.
Mla Rajaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Mla Rajaiah) మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. స్టేషన్ ఘన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య.. మరోసారి టికెట్ ఆశించారు. ఈ సారి కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. ఇక అప్పటినుంచి తన అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. సమయం దొరికితే చాలు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి గొడవను క్లియర్ చేశారు. మనస్థాపంతో ఉన్న రాజయ్యకు కార్పొరేషన్ పదవీ.. అదే రైతు బంధు సమన్వయ సమితి చైర్మన్ పోస్ట్ కూడా ఇచ్చారు.
టికెట్ ఇవ్వకపోవడంతో కార్పొరేషన్ చైర్మన్ పదవీని పార్టీ ఇచ్చింది. అయినప్పటికీ రాజయ్య (Mla Rajaiah) తీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదు. జనగామ వచ్చిన ఆయన మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయ పరిస్థితులు చూస్తూంటే తాను నియోజకవర్గానికి రావాల్సిన అవకాశం లేదన్నారు. ఇక్కడ కష్టమైన పరిస్థితులు నడుస్తున్నాయని చెప్పారు. మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.
నియోజకవర్గంలో డప్పు కొట్టాలన్నా, ఫ్లెక్సీ కట్టాలన్నా, కోలాటం ఆడాలన్నా భయపడుతున్నారని రాజయ్య (Mla Rajaiah) చెబుతున్నారు. ఎందుకు అభద్రత భావంతో ఉన్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఇప్పుడు తాను ఎమ్మెల్యే అని.. జనవరి 17వ తేదీ వరకు తానే ఉంటానని స్పష్టంచేశారు. స్టేషన్ ఘనపూర్‌కు తానే సుప్రీం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్లను బట్టి తనకు టికెట్ ఇవ్వకపోవడంతో మరోసారి విరుచుకుపడ్డారని అర్థం అవుతోంది. అతనిని కూల్ చేసేందుకు ట్రై చేశారు. ఇక వినకుండా పార్టీ పరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే మరోవైపు కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు చేరాలని.. దళితబంధు, గృహలక్ష్మీ పథకాల కోసం లంచం ఇవ్వొద్దని స్పష్టంచేశారు. లబ్ధిదారుల నుంచి మధ్యవర్తుల ద్వారా డబ్బులు వసూల్ చేస్తున్నారని తెలుస్తోందని.. అలాంటి వారి తాటా తీస్తానని తేల్చిచెప్పారు. డబ్బులు వసూల్ చేసినట్టు రుజువు అయితే బట్టలు ఊడదీయిస్తామని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.