తెలంగాణాలో బీసీ నినాదంతో బిఆర్ఎస్ ముందుకు వెళుతోందా, బీసీలను బిఆర్ఎస్ వైపుకు తిప్పే బాధ్యతలను కవితకు అప్పగించారా, అసెంబ్లీలో పూలే విగ్రహం డిమాండ్ అందులో భాగమేనా, బీసీల ఓటు బ్యాంకును పదిలం చేసుకునే వ్యూహరచన బీఆర్ఎస్ చేస్తోందా అనే చర్చిద్దాం.
BRS: రాష్ట్రంలో బీసీ ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడానికి ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. బీసీల అంశాన్ని తెరపైకి తీసుకురావడం ద్వారా ఆయా సామాజిక వర్గాలకు దగ్గర కావాలని ప్రయత్నం చేస్తున్నారు.అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీల అంశాలపై స్పందిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. అదే విధంగా పూలే పేరుతో సంఘాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన బీసీల సదస్సుకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు.
ఇటీవల హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష స్థానానికి పరిమితం అయింది. ఈ సారి బీఆర్ఎస్ పార్టీకి దళితులు, గిరిజనులు ఓట్లు వేయలేదని బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతోంది. దళితులకు దళితబంధు లాంటి పధకాలు అమలు చేసినా అదే విధంగా గిరిజనులకు పోడు పట్టాలు, తండాలను గ్రామ పంచాయతీలుగా చేసినప్పటికీ ఈ ఎన్నికల్లో ఆయా సామాజిక వర్గాలు దూరం అయ్యాయని బీఆర్ఎస్ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. దీంతో ఎస్సీ, ఎస్టీలు తమకు దూరం అయ్యాయని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో దాదాపు 50 శాతానికి పైగా వున్న బీసీలు బిఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచారు. బీసీ సామాజిక వర్గాలు తమకు అండగా నిలవడం ద్వారానే 39 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిందనే చర్చ జరుగుతోంది. దీంతో బీసీ సామాజిక వర్గాలు తమకు దూరం కాకుండా ఉండేందుకు కవిత బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. గత లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తొమ్మిది స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు ప్రతిపక్షంలోకి రావడంతో సిట్టింగ్ స్థానాలు నిలుపుకోవడం సవాల్ గా మారింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అండగా నిలిచిన బీసీల ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీల అంశాన్ని ఎత్తుకున్నారనే భావన నెలకొంది. పదేళ్లు అధికారంలో వుండి బీసీలకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఓట్ల కోసమే కవిత బీసీల జపం చేస్తున్నారనికాంగ్రెస్ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో వున్నప్పుడు అసెంబ్లీలో పూలే విగ్రహం ఎందుకు పెట్టాలని అడగలేదని కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. దీంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలు ఎవరికి మద్దతు ఇస్తారనేది చూడాలి.