BJP మేనిఫెస్టో రిలీజ్: బీసీ అభ్యర్థి సీఎం, మీ భూమి యాప్
బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్ షా విడుదల చేశారు. తమ పార్టీ అధికారంలోకి తీసుకోని వస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కుంభకోణాలపై విచారణకు కమిటీ వేస్తామని పేర్కొన్నారు.
BJP: సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో బీజేపీ మేనిఫెస్టోను (BJP Manifesto) కేంద్ర హోం మంత్రి అమిత్ షా విడుదల చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గిస్తామని ప్రకటించారు. ఉద్యోగులు (employees) పెన్షనర్లకు 1వ తేదీన జీతాలు ఇస్తామని పేర్కొన్నారు. బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని స్పష్టంచేశారు. ధరణి ష్థానంలో మీ భూమి యాప్ తీసుకొస్తామని.. కేంద్ర పథకాల అమలుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పారు. గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేస్తామని వివరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన స్కామ్లపై విచారణకు కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తామని పేర్కొన్నారు. డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు చేసే స్టూడెంట్లకు ఉచితంగా ల్యాప్ టాప్ ఇస్తామని చెప్పారు. నవజాత బాలికకు 21 ఏళ్లు వచ్చాక రూ.2 లక్షలు ఇస్తామన్నారు. ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటన చేశారు. స్వయం సహాయక బృందాలకు 1 శాతం వడ్డీకే రుణాలు అందజేస్తామని ప్రకటించారు. మహిళా రైతుల కోసం మహిళ రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వివరించారు.. మహిళలకు 10 లక్షల ఉద్యోగాలు అందజేస్తామని పేర్కొన్నారు.
6 నెలలకు ఓసారి ఉద్యోగాల భర్తీ
యూపీఎస్సీ తరహాలో 6 నెలలకోసారి టీఎస్ పీఎస్సీ ఉద్యోగాల భర్తీ చేపడుతుందని వివరించారు. ఈడబ్య్లూఎస్ కోటా, ప్రభుత్వ ఉద్యోగాలను 6 నెలల్లో భర్తీ చేస్తామని ప్రకటించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఏడాదికి రూ.10 లక్షల ఉచిత ఆరోగ్య కవరేజీ అందజేస్తారు. వెనకడిన కుటుంబాలకు ఏడాదికోసారి ఉచితంగా వైద్య పరీక్షలను చేస్తారు. జిల్లా స్థాయిలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు ప్రోత్సాహం అందజేస్తారు. కార్పొరేట్ ఆసుపత్రులు ఇష్టారీతిన వసూల్ చేయకుండా చర్యలు తీసుకుంటారు. పోలీసులు, హోంగార్డులు, విద్యార్థులకు పీసీఆర్పై శిక్షణ అందజేస్తారు.
జాతీయ స్థాయిలో సమ్మక్క సారలమ్మ జాతర
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు. బైరాన్ పల్లి, పరకాల ఊచకోతను స్మరించుకుంటూ ఆగస్ట్ 27వ తేదీని రజాకార్ల దుష్కృత్యాల సంస్మరణ దినం పాటిస్తారు. వయోవృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ యాత్ర, ఉమ్మడి పౌరస్మృతి కోసం కమిటీ వేస్తారు. సెప్టెంబర్ 17వ తేదీన అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహిస్తారు. ఎరువుల సబ్సిడీ ఎకరానికి రూ.18 వేలు, రూ.2500 ఇన్ ఫుట్ అసిస్టెన్స్ ఇస్తారు. రైతులకు ఉచిత పంట బీమా, వరికి రూ.3100 మద్దతు ధర, పసుపు కోసం మార్కెట్ ఇంటర్వైన్షన్ ఫండ్ ఏర్పాటు. ఆసక్తి ఉన్న రైతులకు దేశీ ఆవులు ఉచితంగా అందజేస్తారు. నిజామాబాద్ టర్మరిక్ సిటీగా డెవలప్ చేస్తారు. కొత్త ఇళ్ల నిర్మాణం, అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు ఇస్తారు. అర్హులకు కొత్త రేషన్ కార్డుల జారీ చేస్తారు. నాణ్యమైన రేషన్ ప్రజలకు అందేలా పారదర్శక వ్యవస్థ తీసుకొస్తారు. ఆహార ధాన్యాల అక్రమ రవాణాను నివారిస్తామన్నారు.