బీజేపీ అంటేనే కేసీఆర్ భయపడిపోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. తాజాగా బండి సంజయ్ కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఏసీ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలను ఎందుకు పిలవలేదని అడిగినందుకు నోటీసులు పంపుతామనడంపై మండిపడ్డారు. సభలో చర్చ జరగాలని.. రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయంలో అసెంబ్లీ నిర్వహించాలంటేనే కేసీఆర్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
ప్రజా సమస్యలపై చర్చించకుండా టీఆర్ఎస్ సర్కార్ కుట్ర చేస్తోందని.. అందుకు సహకరిస్తున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లు, జిల్లా ఇన్‌చార్జ్‌లతో బుధవారం సమావేశమైన బండి.. ఈ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా హిందూ పండగలకు ప్రాధాన్యత లేకుండా చేసేందుకు కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. హిందూ సమాజం సంఘటితం కావాలంటూ బండి పిలుపునిచ్చారు.
ఇదే విషయమై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ విలేకర్ల సమావేశం నిర్వహించి స్పీకర్ తీరును తప్పుబట్టారు. సభలో కుర్చీలు వెతుక్కునేలోపే ఆరు నిమిషాల్లో అసెంబ్లీ వాయిదా పడిందని చెప్పారు. బీఏసీ సమావేశానికి బీజేపీని పిలవాలని స్పీకర్‌ను కోరినా కూడా ఆహ్వానం అందలేదన్నారు. గతంలో సీపీఎం, లోక్‌సత్తా పార్టీలకు ఒక్కరే ఎమ్మెల్యే ఉన్నా బీఏసీకి పిలిచిన విషయాన్ని కూడా స్పీకర్‌కి గుర్తు చేశానని.. ముగ్గురు ఎమ్మెల్యేలున్నా బీజేపీని ఎందుకు పిలవడం లేదని నిలదీశారు. స్పీకర్‌ని మర మనిషి అంటే తప్పేముందని.. అదేమైనా నిషిద్ధ పదమా అని రఘునందన్ ప్రశ్నించారు.