»At The Time Of The Election There Was A Massive Looting Of Gold And Silver In Hyderabad
Hyderabad: ఎన్నికల వేళ.. హైదరాబాద్లో భారీగా బంగారం, వెండి పట్టివేత
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ తరుణంలో హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ ఆధారాలు చూపని నగదు, బంగారాన్ని సీజ్ చేస్తున్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నిక షెడ్యూల్ ప్రకటన రావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు, అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరైన పత్రాలు చూపించని నగదును, బంగారాన్ని, వెండిని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారానగర్లో పోలీసులు 5.65 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
నిజాం కాలేజీ సమీపంలో గేట్ నెంబర్ 1 వద్ద 7 కిలోల బంగారాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడే 300 కిలోల వెండిని కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని సీజ్ చేశారు. ఫిలింనగర్ పరిధిలోని నారాయణమ్మ కాలేజీ సమీపంలో ఓ కారులో ఎలాంటి రసీదు లేని రూ.30 లక్షలను సీజ్ చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోనూ పెద్ద మొత్తంలో నగదు, బంగారం, అక్రమ మద్యం వంటి వాటిని పోలీసులు పట్టుకున్నారు. ఈ తనిఖీలు రేపట్నుంచి మరింత ఎక్కువగా ఉండనున్నట్లు సమాచారం.