అంబులెన్స్(Ambulance)ను చూసి ఎవరైనా, ఎంత అర్జెంట్ పని ఉన్నా పక్కకు తప్పుకుంటారు.. పీఎం అయినా.. సీఎం అయినా సరే.. అంబులెన్స్ సైరన్ (Siren) విని.. కాన్వాయ్‌ను ఆపిన సందర్భాలు చాలానే ఉన్నాయి. రోడ్డు ప్రమాదమైనా.. మరేదైనా సరే.. చావుబతుకుల్లో ఉన్న వారిని, రోగులను ఆసుపత్రి (hospital) కి తరలించే.. ప్రాణవాహిని అంబులెన్స్.. అలాంటి అంబులెన్స్ ను కొందరు ఇష్టమొచ్చినట్లు దుర్వినియోగం చేస్తున్నారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఓ అంబులెన్స్ డ్రైవర్ వ్యవరించిన తీరు ట్రాఫిక్ పోలీసులతో పాటు స్థానికులకు కోపం తెప్పించింది.ఈ ఘటనపై ఏకంగా డిజిపి సైతం స్పందించారు. వివరాలలోకి వెళితే నారాయణగూడలో ఓ అంబులెన్స్ డ్రైవర్ అత్యవసర సైరన్ మోగించాడు. దీంతో అంబులెన్స్‌లో పేషంట్ ఉండొచ్చని భావించిన ట్రాఫిక్ పోలీసులు రూట్ సిగ్నల్‌ను క్లియర్ చేశారు .సిగ్నల్ (Signal) దాటిన అంబులెన్స్ కాస్త ముందుకెళ్లి రోడ్డు పక్కకు ఆగింది. అంబులెన్స్ డ్రైవర్ కిందకు దిగి, కూల్ డ్రింక్ కొనుగోలు చేశారు. అందులో ఉన్న ఓ ఇద్దరు నర్సులు కూడా పక్కనే ఉన్న ఫుడ్ సెంటర్‌కు వెళ్లి బజ్జీలు, ఇతర ఆహార పదార్థాలు కొన్నారు.
అక్కడే వాటిని తిన్నారు..ఈ విషయాన్ని గమనించిన పోలీసు కానిస్టేబుల్ (Constable) వెంటనే వాహనం దగ్గరకు వచ్చి అంబులెన్స్‌లో రోగి లేరని నిర్ధారించుకున్న తర్వాత , డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్‌లో రోగి ఎవరైనా ఉన్నారేమో అనుకొని, ట్రాఫిక్ క్లియర్ చేశానని, కూల్ డ్రింక్(Cool drink), బజ్జీల కోసం సైరన్ ఎందుకు మోగించావంటూ డ్రైవర్‌ను ప్రశ్నించారు. అయితే అందులో పేషంట్ ఉన్నాడని నమ్మించేందుకు డ్రైవర్ యత్నించాడు. ఈ దృశ్యాలను కానిస్టేబుల్ తో పాటు స్థానికులు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.ఈ వీడియోను రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani Kumar) ట్వీట్ చేశారు. అత్యవసర సమయాల్లో ఉపయోగించే సైరన్‌ను దుర్వినియోగం చేయొద్దంటూ అంబులెన్స్ డ్రైవర్లకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లోనే సైరన్ మోగించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని డీజీపీ హెచ్చరించారు. ఇటువంటి చర్యలు వల్ల అత్యవసర రోగులకు ఇబ్బందులకు కలిగే అవకాశం ఉందని అంబులెన్స్ డ్రైవర్లకు హితబోధ చేశారు డిజిపి..
#TelanganaPolice urges responsible use of ambulance services, citing misuse of sirens. Genuine emergencies require activating sirens for swift and safe passage. Strict action against abusers is advised.