KTR: రంగంలోకి వర్కింగ్ ప్రెసిడెంట్.. సద్దుమణిగిన రాజయ్య- కడియం వివాదం
ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య- కడియం శ్రీహరి మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజయ్యను పిలిపించుకొని మాట్లాడటంతో వివాదం సద్దుమణిగింది.
Rajaiah: స్టేషన్ ఘన్‌పూర్‌లో రాజయ్య (Rajaiah) వర్సెస్ కడియం శ్రీహరి పంచాయితీకి బీఆర్ఎస్ హైకమాండ్ చెక్ పెట్టింది. తొలుత రాజయ్య విమర్శలు చేయగా.. కడియం శ్రీహరి ప్రెస్‌మీట్ పెట్టి మరీ రిప్లై ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రాజయ్యను (Rajaiah) పిలిపించారు. ఏంటీ సంగతి అని అడగగా.. ఏమీ లేదని.. కడియంను తాను వ్యక్తిగతంగా దూషించలేదని పేర్కొన్నారు. గతంలో ఎర్రబెల్లి దయాకర రావు, మోత్కుపల్లి నర్సింహులు, మందకృష్ణ మాదిగ చేసిన కామెంట్లను చెప్పారనని తెలిపారు. కడియంను దళిత వ్యతిరేకి అని అంటున్నారని.. కాదని నిరూపించుకోవాలని సూచించారు.
నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుపీరియర్ అని సీఎం కేసీఆర్ వివిధ సందర్భాల్లో చెప్పారని.. కడియం శ్రీహరి గ్రూప్ రాజకీయాలకు తెరలేపుతున్నారని రాజయ్య పేర్కొన్నారు. ఇదే విషయం కేటీఆర్‌కు చెప్పానని.. నియోజకవర్గంలో మీ పని మీరు చేసుకోవాలని సూచించారని తెలిపారు. తాను నియోజకవర్గంలోనే ఉన్నానని తెలిపారు. తనకు టికెట్ వస్తుందని కడియం శ్రీహరి ప్రచారం చేసుకుంటున్నారని.. ఈ విషయం కేటీఆర్‌తో చెప్పానని తెలిపారు. టికెట్ ఎవరికీ వస్తోందో చెప్పుకున్నప్పటికీ.. చివరిగా కేసీఆర్ నిర్ణయిస్తారని కేటీఆర్ స్పష్టంచేశారు. ఆరోపణలను పట్టించుకోవద్దని.. క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటూ వెళ్లాలని రాజయ్యకు సూచించారు.
4,5 నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. క్రమంగా కాంగ్రెస్ పుంజుకుంటుంది. బీజేపీ గ్రాఫ్ కొంచెం పెరుగుతుంది. అధికార పార్టీలో కాస్త భయం ఉంది. ఇంతలో సొంత పార్టీ నేతల మధ్య గొడవతో కేటీఆర్ రంగంలోకి దిగారు. రాజయ్యకు తనదైన శైలిలో ట్రీట్మెంట్ ఇచ్చారని.. అందుకే ఆయన మెత్తబడ్డారని సమాచారం. ఇకపై నియోజకవర్గంలో ఉంటానని.. పార్టీని మరింత బలోపేతం చేస్తానని అనడం వెనక కారణం అదే ఉంటుందని తెలిపారు. కానీ రాజయ్య నోటి దూల.. సర్పంచ్ నవ్య వ్యవహారం, ఇదివరకు ఆడియో టేపుల వ్యవహారం మచ్చగా ఉన్నాయి.