తెలంగాణలో ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్(Congress) కంచుకోటగా ఉన్న ములుగు నియోజకవర్గం(mulugu constituency)పై అధికార బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేసింది. ప్రస్తుత ఎమ్మెల్యే దాసరి అనసూయ(dansari anasuya).. అలియాస్ సీతక్క(seethakka)పై పోటీ చేసేందుకు BRS తరఫున బడే నాగజ్యోతిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈసారి ఎలాగైనా ములుగులో సీతక్కకు చెక్ పెట్టాలని బీఆర్ఎస్ పలు రకాల ప్రణాళికలు రచిస్తోంది.
బీజేపీ కూడా
మరోవైపు రాష్ట్రంలో క్రమంగా పుంజుకుంటున్న బీజేపీ(BJP) సైతం పావులు కదుపుతోంది. సీతక్కకు దీటుగా నియోజకవర్గంలో ప్రచారం చేసేందుకు కొత్త ప్లాన్స్ వేస్తున్నట్లు సమాచారం. 2018లో బీజేపీ తరుఫున పోటీ చేసిన దేవిలాల్ బానోతుకు 1,339 ఓట్లు మాత్రమే రావడంతో..ఈసారి కొత్త అభ్యర్థిని ఎంపిక చేస్తారనే ప్రచారం కూడా వినిపిస్తోంది. బీజేపీ టికెట్ ఆశిస్తున్న వారిలో భూక్య రాజు నాయక్, భూక్య జవహర్ లాల్, ఆదివాసీ నాయకుడు తాటి కృష్ణ ఉన్నారు. ఇక 2018లో రెండో స్థానంలో నిలిచిన అజ్మీరా చందులాల్ 2021 ఏప్రిల్లో మరణించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈసారి కొత్త అభ్యర్థిని బరిలోకి దించనున్నట్లు తెలుస్తోంది.
సీతక్కపై గెలవాలంటే
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్కకు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని చెప్పవచ్చు. గతంలో కరోనా సమయంలో పలు ప్రాంతాల్లో సీతక్క(seethakka) స్వయంగా పర్యటించి పేదలకు నిత్యవసరాలు పంపిణీ చేశారు. వాహనాలు వెళ్ల లేని మారుమూల గ్రామాలకు సైతం కాలినడకన వెళ్లి సాయం అందించారు. మరోవైపు పలు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించడం సహా జిల్లాలో కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎక్కువగా ప్రజల్లో పర్యటించే సీతక్కపై గెలవాలంటే కొంచెం కష్టమేనని పలువురు అంటున్నారు.
ఆకట్టుకునేందుకు..
మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం తాము చెప్పిన ప్రకారం కొత్త జిల్లా ఏర్పాటు చేశామనే ప్రకటనతోపాటు అభివృద్ధి పథకాలు ఏర్పాటు చేశామనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ సైతం ప్రధాన పార్టీలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుంది. మండలాల వారీగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్లాన్స్ వేస్తున్నట్లు సమాచారం.
అనేక సమస్యలు
ములుగు నియోజకవర్గంలో ప్రధానంగా రోడ్లు, కాలువలు, పోడు భూముల సమస్యలు నెలకొని ఉన్నాయని స్థానిక ప్రజలు చెబుతున్నారు. మరోవైపు డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళిత బంధు సహా అనేక పథకాలు కూడా తమకు అందలేదని గతంలో పలువురు ఆందోళన చేశారు. ఇంకోవైపు బస్ డిపో, క్రీడా మైదానం, గోదావరి కరకట్ట, ములుగు(mulugu) కేంద్రం పట్టణీకరణ, డ్రైనేజీ సమస్యలు కూడా పెండింగ్ లోనే ఉన్నాయని ప్రజలు అంటున్నారు. ఇక విద్య, ఉద్యోగాల విషయంలో కూడా నియోజకవర్గం వెనుకబడే ఉందని వాపోతున్నారు.
ఈసారి కూడా..
ప్రస్తుతం ములుగు నియోజకవర్గంలో 2022 డిసెంబర్ నాటికి 2 లక్షల 11 వేల 160 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో లక్షా 4 వేల 184 మంది పురుషులు ఉండగా, లక్షా 6 వేల 966 మంది మహిళలున్నారు. ఈ నియోజకవర్గంలో 2014లో BRS పార్టీ నుంచి అజ్మీర చందులాల్ ఎమ్మెల్యేగా గెలుపొందగా, రెండు స్థానంలో పొదే వీరయ్య, సీతక్క మూడో స్థానంలో నిలిచారు. తర్వాత 2018 ఎన్నికల్లో సీతక్క ఎమ్మెల్యేగా విజయం సాధించగా, అజ్మీర చందులాల్ రెండో స్థానానికి చేరారు. చందూలాల్ కుమారుడు ఒంటెద్దు పోకడలతోనే 2018 ఎన్నికల్లో సీతక్క పై ఓటమి పాలయ్యారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈఏడాది ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి.