EC: రెండేళ్లలో 22 లక్షల ఓట్లను పరిశీలించి తొలగించాం: సీఈసీ
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ పర్యటన ముగిసింది. సీఈసీ రాజీవ్ కుమార్ సహా కమిషనర్లు రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య, తొలగింపు గురించి రివ్యూ చేశారు. తర్వాత డేటాను మీడియాకు వెల్లడించారు.
CEC: తెలంగాణ రాష్ట్రంలో పురుషులతో సమానంగా స్త్రీల ఓట్లు కూడా ఉన్నాయి. అందరినీ ఓటింగ్లో భాగస్వాములను చేస్తున్నామని ఎన్నికల సంఘం పేర్కొంది. యువ ఓటర్ల సంఖ్య 8 లక్షలు దాటిందని సీఈసీ (CEC) రాజీవ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో 3.17 కోట్ల ఓటర్లు ఉన్నారని వివరించారు. స్త్రీ, పురుష ఓటర్లు సమానంగా ఉండగా.. ట్రాన్స్ జెండర్లు 2557 మంది ఉన్నారని వివరించారు. వందేళ్లు దాటిన వారు 7600 మంది ఉన్నారని పేర్కొన్నారు. 2022-23 ఏడాదిలో 22 లక్షలకు పైగా ఓట్లను పరిశీలించి తొలగించామని స్పష్టంచేశారు. ఏకపక్షంగా ఓట్లను తొలగించలేదని తేల్చిచెప్పారు..
ఓట్ల తొలగింపునకు సంబంధించి ఫామ్ అందిన తర్వాత చర్యలు ప్రారంభించామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్నీ పార్టీల ప్రతినిధులతో సమావేశం అయ్యాయని.. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావంపై కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయని వివరించారు. బుధవారమే ఓటర్ల తుది జాబితా వెల్లడించామని పేర్కొంది.
జూలై తర్వాత అప్లై చేసుకున్న 2.21 లక్షల యువతకు ఓటు హక్కు కల్పించామని సీఈసీ (CEC) పేర్కొన్నారు. 66 నియోజకవర్గాల్లో పురుషుల కన్నా స్ట్రీలే ఎక్కువ ఓటర్లు ఉన్నారని తెలిపారు. 18-19 ఏళ్ల యువ మహిళా ఓటర్లు 3.45 లక్షల మంది ఉన్నారని వివరించారు. అంతేకాదు 80 ఏళ్లు దాటిన వారు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 35,356 పోలింగ్ స్టేషన్లు ఉండగా.. సగటు ఓటర్ల సంఖ్య 897గా ఉంది. ఫిర్యాదుల స్వీకరణ కోసం సీ విజిల్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. ఎన్నికల షెడ్యూల్ ఇచ్చే ముందు రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ సమీక్ష ముగిసింది. ఈ నెల 10వ తేదీ లోపు షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉంది.